CM KCR: తెలంగాణలో కరోనా కట్టడికి రెండంచల వ్యూహాన్ని అనుసరించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. కొవిడ్ పరిస్థితి, లాక్‌డౌన్ అమలు అంశాలపై మంత్రులు, ఉన్నతాధికారులతో ప్రగతి భవన్‌లో ఆయన సమీక్ష నిర్వహించారు. జ్వర సర్వే, మెడికల్ కిట్ల పంపిణీ మంచి ఫలితాలు ఇస్తోందని, వీటిని కొనసాగించాలని అధికారులను ఆదేశించారు.
కరోనా టెస్టుల సంఖ్యను మరింతగా పెంచాలని సూచించారు. పీహెచ్‌సీల్లో ప్రతి ఒక్కరికీ కరోనా పరీక్షలు నిర్వహించాలని, ర్యాపిడ్ యాంటీ జెన్ టెస్టు కిట్ల సంఖ్య పెంచాలని కోరారు. రేపటి నుంచి అన్ని వైద్య కేంద్రాల్లో కిట్ల సంఖ్యను పెంచాలన్నారు. బ్లాక్ ఫంగస్ చికిత్సకు పడకలు, మందులు సమకూర్చుకోవాలని తెలిపారు.
ఈ సమావేశంలో మంత్రులు హరీశ్‌రావు, సత్యవతి రాథోడ్, సీఎస్ సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డితోపాటు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.