భారత్‌ రాష్ట్రీయ సమితి.. త్వరలో కేసీఆర్‌ జాతీయ పార్టీ?

National Party: జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ కీలక పాత్ర పోషించేందుకు సిద్ధమయ్యారు.

Update: 2022-06-11 02:30 GMT

భారత్‌ రాష్ట్రీయ సమితి.. త్వరలో కేసీఆర్‌ జాతీయ పార్టీ?

National Party: జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ కీలక పాత్ర పోషించేందుకు సిద్ధమయ్యారు. ఎట్టి పరిస్థితుల్లో కొత్త జాతీయ పార్టీ తీసుకురావాల్సిన అవసరముందని తేల్చిచెప్పారు. ఈ క్రమంలోనే రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, విప్‌లు, ఫ్లోర్ లీడ‌ర్లతో కేసీఆర్ నిన్న రాత్రి కీలక స‌మావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో తాజా పరిణామాలు, రాజకీయ, పాలనాపరమైన అంశాలపై చర్చించారు. రాష్ట్రప‌తి ఎన్నిక‌పై కూడా చ‌ర్చించినట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా జాతీయ రాజకీయాలపైనే కేసీఆర్ నేతలతో చర్చించినట్లు తెలుస్తోంది. కేంద్రంలో బీజేపీని ఎదుర్కొనేందుకు సిద్ధమవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ దేశంలో బీజేపీని ఎదుర్కొనే పరిస్థితిలో లేదని, కాంగ్రెస్ ఉనికిని కోల్పోయిందని కేసీఆర్ అభిప్రాయపడినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే ఈ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా మనమే కొత్త పార్టీని తీసుకువద్దామని కేసీఆర్ నేతలకు చెప్పినట్లు సమాచారం.

ఇప్పటి వరకు కాంగ్రెస్, బీజేపీలే కేంద్రంలో చక్రం తిప్పాయి. అయితే, ఈ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయం అవసరమని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ఈ రెండు పార్టీలు దేశ ప్రజల ప్రయోజనాలకు పెద్ద పీట వేయలేకపోయాయని, కేంద్రంలో మరో బలమైన పార్టీ కావాలని అన్నారు. అందుకే జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీని ప్రారంభించాలని కేసీఆర్ నిర్ణయించారు. అంతేగాక, ఈ పార్టీకి భారత్ రాష్ట్రీయ సమితి లేదా భారత్ రాష్ట్ర సమితిగా పేరును కూడా ఖరారు చేసినట్లు తెలిసింది.

టీఆర్ఎస్ పార్టీనే భారత్ రాష్ట్రీయ సమితిగా మార్చనున్నట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. జాతీయ స్థాయిలో పార్టీ పెట్టాలని నిర్ణయించిన కేసీఆర్ ఈ పార్టీని దేశ రాజధాని ఢిల్లీలోనే ప్రకటించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఢిల్లీ వేదికగానే త్వరలోనే భారత్ రాష్ట్రీయ పార్టీని కేసీఆర్ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. 

Tags:    

Similar News