Special priority to Vaastu for New Telangana Secretariat: వాస్తు ప్రాధాన్యత తో కొత్త సచివాలయం!
ఆరంతస్తుల భవనం అత్యాధునిక హంగులు రాష్ట్ర సంస్కృతి ప్రతిబింబించేలా తెలంగాణ కొత్త సచివాలయం రూపుదిద్దుకోనుంది. డెక్కన్ కాకతీయ శైలిలో రూపొందించిన సమీకృత సచివాలయ డిజైన్‌కు ఇప్పటికే సీఎం ఓకే కూడా చెప్పారు. అయితే ఏ పనిచేసినా సెంటిమెంట్‌ను నమ్ముకునే కేసీఆర్ కొత్త సచివాలయ నిర్మాణంలో కూడా వాస్తుకే అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. దీంతో కొత్త సెక్రటేరియట్‌లో సిఎం కేసీఆర్ చాంబర్ ఎక్కడ అనే చర్చ జరుగుతోంది.
కేసీఆర్ అంటే సెంటిమెంట్ తన సెంటిమెంట్ పక్కన బెట్టి ఆయన ఒక్క పని కూడా ప్రారంభించరు. ఏ రాజకీయ కార్యమైనా మొదలుపెట్టాలంటే కోనాయిపల్లి వెంకటేశ్వరుని ఆశీర్వాదాలు తీసుకోవటం ఆయనకు ఆనవాయితీ. అలాగే ఉద్యమ కాలం నుంచి ఎన్నికల ప్రచారాల వరకు కరీంనగర్ గడ్డ ఆయనకు అచ్చొచ్చింది. ఇవే కాదు ఏ పని చేసినా అందులో తన లక్కీ నెంబర్ ఆరు ఉండేలా పక్కా లెక్క చూసుకుంటారు కేసీఆర్. ఇప్పుడు సెక్రటేరియేట్ నిర్మాణంలో కూడా అదే సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్నారు సీఎం కేసీఆర్.
ఇప్పటివరకు పాత సెక్రటేరియట్‌లో అడుగుపెట్టని కేసీఆర్ ఈ సెక్రటేరియట్ నిర్మాణంలో వాస్తుకి పెద్దపీట వేస్తున్నారు. సరికొత్తగా ఛాంబర్‌ను ఏర్పాటు చేయించుకుంటున్నారు. తన సెంటిమెంట్‌కు తగినట్లుగా దగ్గరుండి డిజైన్లను కూడా సూచిస్తున్నట్లు తెలుస్తోంది.
సీఎం సూచించిన డిజైన్ ప్రకారం ఆయన ఛాంబర్ ఆరవ అంతస్తులోని నైరుతి మూలలో ఉండనుంది. ఇక్కడి నుంచే సీఎం కేసీఆర్ అధికారిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇందుకోసం ఆరవ అంతస్తు ప్రత్యేకంగా ఉండేలా సీఎం సూచనలకు తగినట్లుగా డిజైన్లకు మెరుగులు దిద్దుతున్నారు. ముఖ్యమంత్రి కోసం ప్రత్యేక ప్రవేశద్వారం కూడా ఏర్పాటు చేయనున్నారు.