Kcr On Singareni Compassionate Appointments : సింగరేణి కారుణ్య నియామకాలపై గులాబీ బాస్ కీలక వ్యాఖ్యలు

Update: 2020-09-14 07:44 GMT

Kcr On Singareni Compassionate Appointments : తెలంగాణ సిరుల తల్లి సింగరేణిలో ప్రస్తుతం కారుణ్య నియామకాలపై (వారసత్వ ఉద్యోగాలపై ) సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు సింగరేణి సమస్యలపై అడిగిన ప్రశ్నలపై సీఎం కేసీఆర్ వివరణ ఇచ్చారు. సింగరేణి సంస్థలో అర్హత ఉన్న వారికి కచ్చితంగా ఉద్యోగం ఇస్తామన్నారు. చదువుకుని ఖాళీగా ఉన్న నిరుద్యోగులకు వారి చదువుకు సమాన స్థాయి ఉద్యోగాలు ఖాళీ అయినప్పుడు తప్పకుండా నియమిస్తామన్నారు. అంతే కాని ఇప్పటికిప్పుడు కొత్త పోస్టులు సృష్టించి వారికి ఉద్యోగాలు ఇవ్వడం కుదరదని, ఇవ్వబడవని స్పష్టం చేశారు. తండ్రి ఉద్యోగంలో చేరిన వారికి సంస్థ మంచి, చెడులు తెలియాలన్నారు. ప్రస్తుతం నియమించిన వారిని తక్షణమే జనరల్ మజ్దూర్ గా తీసుకుంటామన్నారు. కొద్ది రోజుల పాటు వారికి శిక్షణ ఇచ్చి అప్‌గ్రేడ్ చేసి ఆ తరువాత వారిని పోస్టులోకి తీసుకుంటామని కేసీఆర్ స్పష్టం చేశారు. కారుణ్య నియామకాలు వీలైనంత త్వరగా పూర్తయ్యేలా చూస్తామని సీఎం కేసీఆర్ సభా వేదికగా హామీ ఇచ్చారు.

సింగరేణి కార్మికుల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని ఆయన అన్నారు. సింగరేణి కార్మికులకు అధికంగా ఇన్‌కం ట్యాక్స్ చెల్లిస్తున్నారని, దాన్ని రద్దు చేయాలని ప్రధాని మోదీని అనేకసార్లు కోరామని సీఎం పేర్కొన్నారు. అయినా కేంద్రం మాత్రం ఈ విషయాన్ని పట్టించుకోకుండా పెడచెవిన పెడుతుందన్నారు. రిటైర్డ్ ఉద్యోగుల గురించి మానవీయ కోణంలో ఆలోచించాలన్నారు. పదవీ విరమణ చేసి రోజునే అన్ని ఇచ్చి గౌరవంగా పంపాలి అని సీఎం సూచించారు. సింగరేణిలో ఏళ్ల పాటు సర్వీసులో ఉండి పనిచేసి రిటైర్ అయిన కార్మికులను కూడా గౌరవించాలన్నారు. ఉద్యోగంలో చేరిన నాటి నుంచి పదవీ విరమణ పొందేంత వరకు స్కేల్ ఎంత, ఎంత వస్తుంది, రిటైర్డ్ అయ్యే రోజు ఎంత వస్తుందో లెక్కలు పూర్తయ్యి ఉండాలన్నారు. వీటన్నిటిపై సమగ్ర విధివిధానాలు త్వరలో రూపొందిస్తామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమంపై ప్రత్యేక వ్యవస్థ ఉండాలన్నారు సీఎం కేసీఆర్.

Tags:    

Similar News