నేడు వరంగల్, గజ్వేల్‌లో సీఎం కేసీఆర్ ప్రచారం
CM KCR: ఉ.11.30కు వరంగల్ ఈస్ట్‌లో కేసీఆర్ బహిరంగ సభ
CM KCR: తెలంగాణ అసెంబ్లి ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. ఇవాళ సాయంత్రం 5 గంటలకు ప్రచార పర్వానికి ముగింపుపడనుంది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ మూడు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. వరంగల్ ఈస్ట్, వరంగల్ వెస్ట్ నియోజకవర్గాలతో పాటు గజ్వేల్‌లో ప్రజా ఆశీర్వాద సభలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభకు హాజరవుతారు.
వరంగల్ పట్టణంలోని తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల బీఆర్‌ఎస్ అభ్యర్థులు దాస్యం వినయ్ భాస్కర్, నన్నపునేని నరేందర్ తరఫున ప్రచారం నిర్వహిస్తారు. అనంతరం గజ్వేల్ బయల్దేరుతారు. అక్కడ నిర్వహిచనున్న ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని ఎన్నికల ప్రచారాన్ని ముగించనున్నారు. దీంతో హైదరాబాద్ మినహా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో సీఎం కేసీఆర్ ప్రచారం నిర్వహించినట్లవుతుంది. ఈ నెల 30న ఎన్నికల పోలింగ్ జరుగనుంది. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడుతాయి.