CM KCR: సికింద్రాబాద్ హింసాత్మక ఘటనపై సీఎం కేసీఆర్ ఆవేదన

CM KCR: కేంద్రం తప్పుడు విధానాలతో రాకేష్ అనే యువకుడు మృతి

Update: 2022-06-18 02:27 GMT

సికింద్రాబాద్ హింసాత్మక ఘటనపై సీఎం కేసీఆర్ ఆవేదన

CM KCR: త్రివిధ దళాల్లో రిక్రూట్‌మెంట్‌ కోసం కేంద్రం తెచ్చిన 'అగ్నిపథ్‌' పథకం అగ్గి పుట్టించింది. కేంద్ర ప్రభుత్వంపై రాజకీయ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేశ వ్యాప్తంగా వెల్లువెత్తుతున్ననిరసనలు, యువత ఆగ్రహాం, ఆందోళలనలకు కేంద్రమే పూర్తి బాధ్యత వహించాలంటూ రాజకీయ పక్షాలు మండిపడుతున్నాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో హింసాత్మక ఘటనపై సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం తప్పుడు విధానాలతో రాకేశ్ అనే యువకుడు మృతి చెందాడని విచారం వ్యక్తం చేశారు.

అగ్నిపథ్ నిరసనలతో తెలుగు రాష్ర్టాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన హింస్మాత్మక ఘటనకు కేంద్ర ప్రభుత్వానిదే బాధ్యత అంటూ టీఆర్ఎస్ సహా కాంగ్రెస్, జనసేన, వామపక్ష పార్టీలు ఆరోపిస్తుండగా... తెలంగాణ ప్రభుత్వం సరైన రక్షణ కల్పించలేదని బీజేపీ నేతలు ఆరోపించారు. రైల్వే పోలీసుల కాల్పుల్లో వరంగల్ జిల్లాకు చెందిన రాకేష్ మరణం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. రాకేష్ కుటుంబానికి 25 లక్షల రూపాయల ఆర్దిక సహాయం ప్రకటించారు. రాకేష్ కుటుంబంలో అర్హులైన వారికి ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. రాకేశ్ కుటుంబ సభ్యులవకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్. తెలంగాణ బిడ్డలను ప్రభుత్వం కడుపులో పెట్టుకొని కాపాడుకుటుహందని సీఎం తెలిపారు.

కేంద్రం ఏకపక్ష నిర్ణయాలతోనే హింసాత్మక నిరసనలు వెల్లువెత్తాయని తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. నాడు రైతులతో పెట్టుకున్నారని.. నేడు జవాన్లతో పెట్టుకున్నారని విమర్శించారు. వన్ ర్యాంక్-వన్ పెన్షన్ నుంచి ప్రతిపాదిత నో ర్యాంక్-నో పెన్షన్ వరకు అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి కేటీఆర్ ట్వీట్ చేశారు. అగ్నిపథ్ పథకం పున సమీక్ష చేయాలి అని మంత్రి కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు.

మరో వైపు సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో పోలీసుల కాల్పుల్లో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని మంత్రి హరీష్ రావు అధికారులను ఆదేశించారు. పోలీసుల కాల్పుల్లో గాయపడిన గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారందరికీ మెరుగైన ట్రీట్‌మెంట్‌ అందించాలని హరీష్ రావు ఆదేశించారు. రక్షణ రంగంలో ఉద్యోగాలు పొందేందుకు శిక్షణ తీసుకున్న యువతకు నాలుగేళ్లుగా నిరాశే ఎదురవుతుండటంతో.. వారి గుండెల్లోంచి పెల్లుబికిన ఆవేదనే సికింద్రాబాద్‌ ఘటనకు కారణమని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు.

కేంద్ర ప్రభుత్వ విధానాలు యువతలో ఆగ్రహజ్వాలకు కారణమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అభిప్రాయ పడ్డారు. బీహార్‌లో చెలరేగిన హింస సికింద్రాబాద్‌ను తాకిందని ప్రస్తావించారు. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ హింసకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. ఇంటెలిజెన్స్ వైఫల్యంపై నారాయణ మండిపడ్డారు. ప్రభుత్వం లోపాలను సరిజేసుకోకుండా... చెలరేగిన హింసపై ఆరాతీయడం కోడిగుడ్డుపై ఈకలు పీకడమేనని నారాయణ ఎద్దేవాచేశారు. ఘటన పట్ల జనసేన అధినేత పవన్ కల్యాణ్ విచారం వ్యక్తం చేశారు. ఆర్మీ రిక్రూట్ మెంట్ విధానంపై చేపట్టిన నిరసన కార్యక్రమం హిసాత్మకంగా మారడం బాధాకరమన్నారు జనసేనాని.

ఇది ఇలా ఉంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు వేలా మంది నిరసనకారులు వస్తుంటే నిఘా వ్యవస్థ ఏం చేస్తుందని ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రశ్నించారు. నిఘా వ్యవస్థ కూడా ఫామ్‌హౌస్‌లో పడుకుందా అని ఎద్దెవా చేశారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి పోటీ చేసేందుకే నిన్నటి రాజ్ భవన్ ముట్టడి డ్రామా అని విమర్శించారు. సైన్యంలో చేరాలనుకునే యువకులు అల్లర్లకు పాల్పడరని ప్రభుత్వం గుండాలను పంపి అల్లర్లను ప్రోత్సహిస్తుందని రఘనందన్‌రావు ఆరోపించగా..హైదరాబాద్ లో రైల్వే ఆస్తుల ధ్వంసం వెనుక కుట్ర ఉందని ఏఫీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అనుమానం వ్యక్తం చేశారు. మొత్తానికి అగ్నిపథ్ వివాదం రాజకీయంగా ఏ మలుపు తిరుగుతుందో అన్న ఆందోళన వ్యక్తం అవుతోంది.

Tags:    

Similar News