CM KCR: తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

CM KCR:తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడి గెలిచాం -కేసీఆర్ * రాష్ట్ర సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం -కేసీఆర్

Update: 2021-08-15 07:45 GMT

గోల్కొండ కోట వద్ద జెండా ఆవిష్కరణ చేసిన సీఎం కెసిఆర్ (ఫైల్ ఇమేజ్)

CM KCR: తెలంగాణలో 75వ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గోల్కొండ కోటలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు సీఎం కేసీఆర్. అనంతరం రాష్ట్ర ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇది భారత స్వాతంత్ర్య అమృత ఉత్సవాలు జరుగుతున్న సందర్భమని, జాతి చరిత్రలో ఒక విశిష్ట ఘట్టమని అభివర్ణించారు సీఎం కేసీఆర్. ఈ సందర్భంగా దేశ స్వాతంత్ర్య సాధన కోసం జరిగిన పోరాటంలోని ఉజ్వల ఘట్టాలను, స్వాతంత్ర్య సమరవీరుల మహోన్నత త్యాగాలను యావత్ భారత జాతి సగర్వంగా స్మరించుకుంటోందన్నారు. దేశ విముక్తి కోసం తృణ ప్రాయంగా తమ ప్రాణాలను త్యాగం చేసిన మహానీయులందరికీ వినమ్రంగా నివాళులు అర్పిస్తున్నామన్నారు సీఎం కేసీఆర్.

స్వరాష్ట్రం సాధించుకున్న నాటి నుంచి ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని అన్నారు సీఎం కేసీఆర్. అన్నివర్గాల సంక్షేమం కోసం ప్రణాళికలు రూపొందించుకొని పథకాలు అమలు చేస్తున్నామన్నారు. దేశ తలసరి ఆదాయం కంటే, తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం రెట్టింపు స్థాయిలో ఉండటం గమనార్హమన్నారు. కరెంటు కష్టాలకు చరమగీతం పాడిన రాష్ట్రంగా తెలంగాణ చరిత్రకెక్కిందన్న కేసీఆర్‌.. దేశంలో 24 గంటలూ రైతులందరికీ ఉచిత విద్యుత్తును అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు ప్రభుత్వ పరిధిలో కేవలం 71 మెగావాట్ల సోలార్ విద్యుత్తు మాత్రమే ఉత్పత్తయ్యేది. ప్రస్తుతం మన రాష్ట్రం 4 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉంది. సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో తెలంగాణ.. దేశంలోనే రెండో స్థానంలో ఉందని అన్నారు సీఎం కేసీఆర్.

తెలంగాణ ప్రభుత్వం చేసిన అద్భుతమైన కృషితో వ్యవసాయ రంగంలో అసాధారణమైన అభివృద్ధి నమోదయిందని అన్నారు సీఎం కేసీఆర్. ఒకప్పుడు తెలంగాణ కరవు కాటకాలకు చిరునామాగా ఉండేదని, కానీ.. 2020-21 వ్యవసాయ సంవత్సరంలో మొత్తం వ్యవసాయ ఉత్పత్తులు కలిపి మూడుకోట్ల నలభై లక్షల టన్నుల దిగుబడిని సాధించిన రాష్ట్రంగా దేశంలో అగ్రభాగాన నిలిచిందన్నారు. దండుగ అనుకున్న వ్యవసాయాన్ని ప్రభుత్వం పండుగలా మార్చిందని, దేశానికే అన్నం పెట్టే అన్నపూర్ణగా తెలంగాణ రాష్ట్రం అవతరించిందని అన్నారు. రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా తెలంగాణ ప్రసిద్ధికెక్కిందన్నారు సీఎం కేసీఆర్.

2013-14 లో తెలంగాణలో దాదాపు 49 లక్షల ఎకరాల్లో వరిపంట సాగయితే, 2020-21 ఆర్థిక సంవత్సరంలో కోటి ఆరు లక్షల ఎకరాల్లో వరిపంట సాగయింది. పత్తి సాగులో తెలంగాణా దేశంలోనే రెండో స్థానంలో ఉందన్నారు సీఎం కేసీఆర్. దేశంలో తెలంగాణ పత్తికి మార్కెట్‌లో ఎంతో డిమాండ్ ఉందన్నారు. గత ఏడాది ధాన్యం కొనుగోళ్ళలో దేశంలో రెండో స్థానంలో ఉన్న తెలంగాణ, నేడు నెంబర్‌ వన్‌ దిశగా అడుగులు వేస్తోందని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం.. ఊరూరా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి, గిట్టుబాటు ధరకు రైతుల నుంచి చివరి గింజ వరకూ ధాన్యం సేకరిస్తోందని చెప్పారు సీఎం కేసీఆర్

కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడ చూసినా దళిత ప్రజలు దుర్భర పేదరికంలో మగ్గుతున్నారనేది నగ్న సత్యమని అన్నారు సీఎం కేసీఆర్. స్వాతంత్ర్యం వచ్చి 75ఏళ్లు గడిచినా దళితుల జీవితాల్లో ఇంకా చీకటే అలుముకొని ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం దళితబంధు ఉద్యమానికి నాంది పలికిందన్నారు. దళితులను ఆర్థికంగా బలోపేతంచేసి, తద్వారా సామాజిక వివక్ష నుంచి వారికి విముక్తి కల్గించడమే లక్ష్యంగా పెట్టుకొని స్వయంగా తానే దళితబంధు పథకానికి రూపకల్పన చేశానని చెప్పారు సీఎం కేసీఆర్. దళితబంధు కింద ఒక్కో కుటుంబానికి 10 లక్షలు అందజేస్తున్నామన్నారు. ప్రతి లబ్దిదారుడికి ప్రభుత్వం ఇచ్చే 10 లక్షల రూపాయలలో 10 వేల రూపాయలు లబ్దిదారుని వాటా కింద జమ చేసుకొని.. దానికి మరో 10 వేల రూపాయలు ప్రభుత్వం కలిపి దళిత రక్షణ నిధిని నిల్వ చేస్తుందని చెప్పారు సీఎం కేసీఆర్. 

Tags:    

Similar News