KCR Meets Farmers: రైతు సంఘాలతో సీఎం కేసీఆర్ సుదీర్ఘ సమావేశం
KCR Meets Farmers: దేశవ్యాప్తంగా రైతు సంక్షేమ విధానాలు అమలు కావాలి
KCR Meets Farmers: తెలంగాణలో అమలవుతున్న రైతు సంక్షేమ విధానాలు దేశవ్యాప్తంగా అమలు కావాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. రైతు సంఘాలతో సీఎం కేసీఆర్ సుదీర్ఘంగా సమావేశం అయ్యారు. దేశవ్యాప్తంగా రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. తెలంగాణ తరహా అభివృద్ధి కోసం జాతీయ రైతు ఐక్య వేదిక ఏర్పాటు చేయాలని కేసీఆర్ అధ్యక్షతన కొనసాగిన జాతీయ రైతు సంఘాల నాయకుల సమావేశంలో తీర్మానం చేశారు.
ఉత్తర, దక్షిణ భారత్ సహా ఈశాన్య రాష్ట్రాల్లో వ్యవసాయం, రైతు సంక్షేమంపై సీఎం కేసీఆర్ రైతులతో చర్చించారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీశారు.దేశ వ్యవసాయ రంగానికి తెలంగాణ మోడల్ అత్యవసరం అని సమావేశంలో పాల్గొన్న వక్తలు అభిప్రాయపడ్డారు. వ్యవసాయం, గిట్టుబాటు ధరలు కల్పించే విషయంలో కేంద్రం అనుసరిస్తున్న విధానాలపై రైతు సంఘాల నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. దేశంలో అసంఘటితంగా ఉన్న రైతాంగం మొత్తం సంఘటితం కావాలని అందుకు కేసీఆర్ చొరవ తీసుకోవాలని రైతు నేతలు కోరారు.
స్వాతంత్ర్యం వచ్చిన ఇన్నేళైనా రైతులు తమ సమస్యల పరిష్కారం కోసం ఎదురుచూడాల్సి రావడం దారుణం అన్నారు సీఎం కేసీఆర్. దేశంలో మొత్తం 70వేల టీఎంసీల నీటి వనరులు అందుబాటులో ఉన్నాయన్నారు. తాగునీరు, సాగునీరుకు 50వేల టీఎంసీల నీరు సరిపోతుందని.. అయినా ఇంకా వాటిని మనంసద్వినియోగం చేసుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు కేసీఆర్.కొత్తగా ఏర్పడిన తెలంగా రాష్ట్రం.. రైతులందరికీ ఉచిత విద్యుత్ ఇస్తూ సాగునీటిని అందిస్తున్నప్పుడు ఈ పనిని కేంద్రం దేశవ్యాప్తంగా ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు కేసీఆర్. రైతులు కూర్చుని మాట్లాడుకోవడానికి తెలంగాణలో ఉన్నట్టు దేశంలో ఎక్కడైనా కిసాన్ మంచ్ లు ఉన్నాయా? అని నిలదీశారు. కేంద్ర పాలకులు ఎందుకు వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారో విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉందన్నారు కేసీఆర్.
రైతు సంఘాల నేతలకు ప్రగతిభవన్ లోనే అల్పాహారం, లంచ్ ఏర్పాటు చేశారు. రాకేశ్ టికాయత్ ఆదివారం ప్రగతి భవన్ కు రానున్నారు. ఆదివారం కూడా రైతు సంఘాల నేతలతో సీఎం కేసీఆర్ సమావేశం అవుతారు. వ్యవసాయ సమస్యలు, పరిష్కార మార్గాలపై చర్చించనున్నారు. శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు రైతు సంఘాల నేతలతో సుదీర్ఘంగా సమావేశం అయ్యారు సీఎం కేసీఆర్. 26 రాష్ట్రాలకు చెందిన రైతు సంఘాల నాయకులు ఈ భేటీలో పాల్గొన్నారు.