అధికారులకు సీఎం కేసీఆర్ క్లాస్.. అనుకున్నంత ప్రగతి జరగడం లేదని...
KCR: పద్ధతి మార్చుకోకపోతే వేటు తప్పదని హెచ్చరిక...
KCR: ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమంలో పట్టణ ప్రగతి కార్యక్రమం పట్ల సీఎం తీవ్ర అసంతృప్తికి కారణం ఏంటి? పల్లె ప్రగతి తరహాలో పట్టణ ప్రగతి జరగడం లేదని సీఎం క్లాస్ పీకిన ఆ అధికారి ఎవరు? పద్ధతి మార్చుకోకపోతే వేటు తప్పదని హెచ్చరించడానికి వెనుక ఉన్న అసలు కారణం ఏంటి?
గడిచిన సంవత్సరం జూన్ 11 న ప్రగతి భవన్ లో పల్లె ప్రగతి పట్టణ ప్రగతి పై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. అదే నెల 19 న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో మున్సిపాలిటీలు , కార్పొరేషన్ లు సందర్శిస్తానని ప్రకటించారు. దాని తరువాత జులై 1 , 2021 న రాష్ట్ర వ్యాప్తంగా పల్లె ప్రగతి ,పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది.. కార్యక్రమం ప్రారంభంలో ప్రభుత్వం కొన్ని నిధులను కేటాయించగా దీనికి ఆర్థికశాఖ క్లియరెన్స్ ఇవ్వకపోవడం చాలా నిధులు పెండింగ్ లో ఉన్నాయి.
అయితే ఈనెల 18 న ప్రగతి భవన్ లో అన్ని జిల్లాల కలెక్టర్లు , అడిషనల్ కలెక్టర్లు, మంత్రులు ,జిల్లా స్థాయి అధికారులతో సీఎం రివ్యూ నిర్వహించారు.ఈ సమీక్ష లో పలు రకాల సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్లారు అధికారులు. అయితే రాష్ట్రంలో పల్లె ప్రగతి సాదించినంత ప్రగతి పట్టణ ప్రగతి సాదించలేదని సీఎం తీవ్రస్థాయిలో అధికారులపై సీరియస్ అయ్యారట. వాస్తవానికి పల్లె ప్రగతికి పట్టణ ప్రగతికి ప్రభుత్వం దాదాపు వెయ్యి కోట్లకు పైగా నిధులు బకాయిలు ఉన్నాయి.
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఉత్తమ ఆదర్శ గ్రామాల అవార్డులను గెలుచుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేసిన సీఎం పట్టణాల్లో కంటే పల్లెలో ప్రగతి ఎక్కువగా కనిపిస్తుందని.... దీనికి గల కారణాలు ఏంటని అధికారులను నిలదీశారు. పల్లె ప్రగతిలో భాగంగా వైకుంఠ దామలు , పల్లె ప్రకృతి వానలు , చెట్లు , డంపింగ్ యార్డులు , క్లీనింగ్ లాంటి పనులు జరుగుతున్నాయి. కానీ పట్టణాల్లో అనుకునంత ప్రగతి జరగడం లేదు. దీనికి గలా కారణాలు తక్షణమే ఇవ్వాలని మునిసిపాలిటీ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అరవింద్ కుమార్ తో పాటు మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ కు సీఎం క్లాస్ పీకారట.
రాష్ట్ర వ్యాప్తంగా 13 మునిసిపల్ కార్పొరేషన్లు, 128మునిసిపాలిటీ లు ఉన్నాయి. గడిచిన ఏడాది తో సంబంధం లేకుండా ఈ ఏడాదికి పట్టణ ప్రగతికి దాదాపు 400 కోట్లు అవసరం కానున్నాయి. ఈ నిధులు విడుదల కాకుండా పట్టణ ప్రగతి కార్యక్రమం ముందుకు సాగడం కష్టమని ఎం.ఏ.యు.డి అధికారులు చెప్తున్నారు. అయితే పట్టణ ప్రగతి కార్యక్రమ నిర్వహణ కోసం గడిచిన సంవత్సరం జీహెచ్‌ఎంసీ పరిధిలో 955 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. అంతేకాక 936 కోట్లు కేటాయించింది.
ఈ కార్యక్రమంలో భాగంగా వార్డుల వారీగా అభివృద్ధి కార్యక్రమాల సమీక్ష, సీజనల్ వ్యాధుల నివారణ కోసం పారిశుధ్య కార్యక్రమాలు, నీటి నిల్వల తొలగింపు, దోమల నివారణకు మందుల స్ప్రేయింగ్, చెత్త తొలగింపు, రహదారుల వెంట పిచ్చి మొక్కలు, భవన నిర్మాణ వ్యర్థాల తొలగింపు, శిథిల భవనాల కూల్చివేత, ఖాళీ స్థలాల్లో హరితహారం, వెజ్, నాన్ వెజ్ మార్కెట్లకు స్థల సేకరణ చేపట్టాలి. వీటిలో ఏ ఒక్కటి పూర్తిస్థాయిలో కంప్లీట్ కాలేదు. దీంతో సీఎం అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇప్పుడైనా అన్ని పట్టణాల్లో మౌలిక వసతులపై మునిసిపాలిటీ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ అధికారులు ద్రుష్టి పెట్టాలని సీఎం వార్నింగ్ ఇచ్చారట. అయితే పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమంలో పట్టణ ప్రగతి వెనుకబాటు పై అధికారులతో పాటు కమిషనర్ కి క్లాస్ పికరట.వచ్చే నెల 3 నుంచి 15 రోజుల పాటు జరుగనున్న పట్టణ ప్రగతిలో పట్టణాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారట. ఎక్కడ ఏ అధికారి కూడా అభివృద్ధి విషయంలో అలసత్వం వహించవద్దని కేసీఆర్ సూచించారట.