Telangana: తెలంగాణ సీఎస్ తీరుపై సీఎం కేసీఆర్ అసంతృప్తి
Telangana: సోమేష్ కుమార్ ను ఏపీకి కి కేటాయిస్తారంటూ ప్రచారం
Telangana: తెలంగాణ సీఎస్ మార్పు ఉంటుందని సచివాలయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది. సోమేష్ కుమార్ ను ఆంద్రప్రదేశ్ కి కేటాయిస్తారని ప్రచారం జరుగుతుంది. 2017 లో సోమేష్ కుమార్ ఆంధ్రప్రదేశ్ కి అలాట్ అయ్యారు. తాత్కాలికంగా తెలంగాణ కి కేటాయించాలని కోరగా తెలంగాణకి కేటాయించారు. అనంతరం 2017 లో డీఓపీటీ కేసు వేసింది. తెలంగాణ కి ఆలాట్ చేయడాన్ని రద్దు చేయాలని కోరింది. ఇక ఈ మధ్య కాలంలోనే క్యాట్ విచారణ చేపట్టింది. ఈ నెల రెండవ వారంలో జడ్జిమెంట్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.
ఇక సీఎస్ తీరుపై ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా గుర్రుగా ఉన్నారట. ఇటీవల సీఎస్ సోమేశ్ కుమార్ తీరుపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, ముఖ్యమంత్రులతో ఢిల్లీ విజ్ఞాన్ భవన్‌లో గత శనివారం సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, సీఎస్ తీరును వివరించారు. న్యాయవ్యవస్థకు సంబంధించిన సమస్యలను పరిష్కారానికి అవసరమైన ఉత్తర్వులు జారీ చేయాలని సీఎస్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు.కానీ సీఎస్ నుంచి సరైన స్పందన లేదని హైకోర్టు సీజేఐ దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయంలో సీఎస్‌పై సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ధరణిలో లోపాలను సరి చేయాలని ప్రజల నుంచి ప్రభుత్వానికి లక్షల ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వం గత 6 నెలల కిందట మంత్రి హరీష్ రావు నేతృత్వంలో క్యాబినెట్ సబ్ కమిటీని నియమించింది. అయితే ధరణిలో లోపాల సవరణకు సీఎస్ సోమేశ్ కుమార్ అనుమతి తప్పనిసరి. కాని ఆయన అస్సలు పట్టించుకోవడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి.
VRAలకు పేస్కేల్ ఇస్తామని సీఎం కేసీఆర్ అనేక సందర్భాల్లో ప్రకటించారు. బడ్జెట్ సమావేశాల్లోను ప్రస్తావించారు. ఆ ఫైల్ కూడా సీఎస్ పక్కకి పెట్టారని VRA లు ఆరోపిస్తున్నారు. ఇలా చాలా సందర్భాల్లో సీఎం కేసీఆర్ సీఎస్ పై సీరియస్ గా ఉన్నారని సచివాలయ వర్గాలు భావిస్తున్నాయి. మరీ క్యాట్ సీఎస్ సోమేష్ కుమార్ ని ఆంధ్రప్రదేశ్ కి వెళ్లాలని సూచిస్తుందా.. ఈ నెలలో ఎలాంటి నిర్ణయం రానుంది.. ఒకవేళ సీఎస్ మార్పు ఉంటే కొత్త సీఎస్ ఎవరు అనేది సచివాలయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది.