KCR: ముందస్తు ఎన్నికలు ఉండవని సీఎం కేసీఆర్‌ స్పష్టం

*చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి : సీఎం కేసీఆర్ *ఈ రెండున్నరేళ్లలో అవన్నీ పూర్తి చేద్దాం : సీఎం కేసీఆర్

Update: 2021-10-18 02:21 GMT

ముందస్తు ఎన్నికలు ఉండవని సీఎం కేసీఆర్‌ స్పష్టం(ఫైల్ ఫోటో) 

KCR: తెలంగాణలో ఈసారి ముందస్తు ఎన్నికలు ఉండవని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. ఎన్నికలకు రెండున్నరేళ్ల సమయం ఉందని, చేయాల్సిన పనులూ ఇంకా చాలా ఉన్నాయని అన్నారు. ఈ సమయంలో అన్ని పనులూ పూర్తి చేసుకుందామని, వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ మరిన్ని స్థానాలు గెలుచుకునేలా కష్టపడి పనిచేయాలని పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సూచించారు. నిన్న తెలంగాణ భవన్‌లో పార్టీ పార్లమెంటరీ, శాసనసభాపక్షాల సంయుక్త సమావేశం జరిగింది.

ఇక హుజూరాబాద్‌ ఉపఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థే గెలుస్తున్నారని కేసీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ కంటే టీఆర్‌ఎస్‌కు 13 శాతం ఓట్లు ఎక్కువ రానున్నాయని తెలిపారు. ప్రచార సభలో తాను కూడా పాల్గొంటానని, ఈ నెల 26 లేదా 27న సభ పెడతానని వెల్లడించారు. అలాగే నవంబరు 15న వరంగల్‌లో తెలంగాణ విజయగర్జన సభను ప్రతిపక్షాలకు దిమ్మతిరిగేలా నిర్వహిద్దామని పిలుపునిచ్చారు. ఈ సభ కోసం రోజుకు 20 నియోజకవర్గాల సన్నాహక సమావేశాలను తెలంగాణ భవన్‌లో నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఇక ఈ నెల 25న హెచ్‌ఐసీసీలో పార్టీ ప్లీనరీని బ్రహ్మాండంగా నిర్వహించుకుందామన్నారు సీఎం కేసీఆర్. ప్లీనరీకి సభ్యుల సంఖ్యను 14 వేల నుంచి 6 వేలకు కుదిస్తున్నట్లు చెప్పారు. ప్రతి నియోజకవర్గం నుంచి 50 మంది చొప్పున రావాలని సూచించారు.

ఇకపై ప్రతిపక్షాల విమర్శలను గట్టిగా తిప్పికొట్టాలని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్‌ సూచించారు. ''మన సైన్యం చాలా పెద్దది. ఇక నుంచి మనమీద మొరుగుతున్న కుక్కలు, నక్కలకు గట్టిగా బుద్ది చెప్పాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాల వాదనల్ని ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలన్నారు. మున్ముందు కేంద్ర రాజకీయాల్లో టీఆర్‌ఎస్‌కు మంచి ప్రాధాన్యం ఉండనుందని కేసీఆర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. లోక్‌సభలో కీలకం కాబోతున్నామని తెలిపారు. ఈ మేరకు రాష్ట్రంలోని లోక్‌సభ స్థానాలపై మరింత దృష్టి పెట్టాలని పార్టీ నేతలకు సూచించారు. 

Tags:    

Similar News