Telangana: సీఎం కేసీఆర్‌తో పీకే వరుస భేటీలు
Telangana: ప్రత్యామ్నాయ రాజకీయ కూటమి కోసం సుధీర్ఘ చర్చలు
Telangana: రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో వరుసపెట్టి భేటీ అవుతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సమావేశం అవుతుండడంతో ఏదో జరుగుతుందన్న అనుమానాలు బలపడతున్నాయి. కొన్ని రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీలో పీకే చేరబోతున్నట్లు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఇటీవల కాంగ్రెస్ అదిష్టానంతో పీకే వరుసగా మంతనాలు జరిపారు. ఈ నేపథ్యంలో జాతీయ రాజకీయాల్లో బీజేపీకి వ్యతిరేకంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తానని వ్యాఖ్యల చేసిన సీఎం కేసీఆర్‌తో పీకే భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
దేశ రాజకీయాల్లో కీలకంగా మారాలని భావిస్తున్న సీఎం కేసీఆర్ సడన్‌గా వరుసపెట్టి పీకేతో సమావేశాలు నిర్వహించడంతో ఇంట్రెస్టింగ్ టాపిక్‌గా మారింది. రెండు రోజుల పాటు కేసీఆర్ తో పీకే జరిపిన సమావేశంలో దేశ రాజకీయాల్లో ఏ విధంగా కీలకంగా మారాలనే దానిపై చర్చించారు. బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటుపై కీలకంగా చర్చించారు. జాతీయ రాజకీయాలు, బీజేపీని ఢీకొట్టడంపై ఇద్దరి మధ్య సుదీర్ఘ చర్చ జరిగింది. ప్రాంతీయ పార్టీలను ఏకం చేసేందుకు గతంలో పలు రాష్ట్రాల్లో పర్యటించారు. ఆ టైంలో పలువురు ప్రాంతీయ పార్టీల నేతలు కాంగ్రెస్ లేని కూటమి సాధ్యం కాదని సూచించారట. దీంతో సీఎం కేసీఆర్ ఫామ్ హౌజ్ వేదిక గా ప్రశాంత్ కిషోర్, సినీ యాక్టర్ ప్రకాష్ రాజ్ తో భేటి అయ్యారు. ఈ భేటిలో తెలంగాణ అభివృద్ధిని దేశ ప్రజలకు తెలిసేలా కార్యచరణ రూపొందించాలన్న విషయాలపై చర్చించారు.
టీఆర్‌ఎస్‌తో పాటు దేశ రాజకీయాల్లో కలిసి వచ్చే పార్టీలతో పీకే సర్వేలు చేయనున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. తాజాగా ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమైంది. ఈ టైంలో పీకేతో కేసీఆర్ కలిసి పని చేస్తాడా లేదా అన్నది పెద్ద చర్చనీయాంశంగా మారింది. దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి తీసుకురావడానికి పీకే కాంగ్రెస్ లో చేరనున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పెద్దలకు ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన ప్రజంటేషన్‌ను కేసీఆర్ కి వివరించారు పీకే. తాను కాంగ్రెస్ లో చేరినా ఐప్యాక్ సేవలు టీఆర్ఎస్ కు ఉంటాయని పీకే క్లారిటీ ఇచ్చారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి రాష్ట్రంలో అప్పటి పరిస్థితులు ఇప్పటి పరిస్థితులపై టీఆర్‌ఎస్ పై ప్రజల అభిప్రాయాలను పీకే టీం సేకరిస్తోంది. ఈ టీం చేసిన సర్వే లో 30 మంది ఎమ్మెల్యే లను సర్వే చేస్తే అందులో 29 మంది మళ్ళీ గెలుస్తారని లెక్కల్లో తేలింది. అయితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నేతలు టీఆర్‌ఎస్ పార్టీ వైఫల్యాలపై ఎండగడుతున్న తరుణంలో, కాంగ్రెస్ పార్టీలో చేరనున్న పీకే సీఎ కేసీఆర్‌తో భేటీ కావడం రాజకీయ నేతల్లో తెలియని క్యూరియాసిటీని పెంచుతోంది.