CLP Meeting: ఇవాళ సీఎల్పీ సమావేశం... వనమా రాఘవపై కఠిన చర్యలకు డిమాండ్
CLP Meeting Today: పార్టీలో అంతర్గత కుమ్ములాటలపై ఉమ్మడి కార్యాచరణ రూపొందించే ఛాన్స్...
CLP Meeting Today: ఇవాళ సీఎల్పీ అత్యవసర సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 12 గంటలకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అధ్యక్షతన జరగనున్న ఈ భేటీకి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయాలపై సీఎల్పీలో చర్చించనున్నారు. అదే విధంగా పార్టీలో కొంతకాలంగా జరుగుతున్న అంతర్గత కుమ్ములాటల వల్ల పార్టీకి నష్టం వాటిల్లే అవకాశం ఉంది. దీంతో.. దీనిపై ఉమ్మడి కార్యాచరణ రూపొందించే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో పాటు.. పలు అంశాలపై సీఎల్పీలో చర్చించనున్నారు.
ముఖ్యంగా.. వనమా అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తుండటం.. నాలుగు రోజుల తర్వాత నిందితుడు వనమా రాఘవను అరెస్ట్ చేసినప్పటికీ.. పోలీసులు నిందితుడికి సహకరిస్తున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. వనమా రాఘవపై కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే.. గతంలో కూడా అతడిపై ఉన్న కేసులపై విచారణ జరిపించాలని, రాఘవ తండ్రి వనమా వెంకటేశ్వరరావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు.
ఇక.. రాష్ట్రంలో కొద్దిరోజులుగా బీజేపీ, టీఆర్‌ఎస్ మధ్య జరుగుతున్న గొడవ.. ఒక చీకటి ఒప్పందంగా కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ విషయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సమావేశంలో చర్చించనున్నారు. అలాగే.. రాష్ట్రంలో 317 జీవో వల్ల ఉద్యోగులు, ఉపాధ్యాయులు స్థానికత కోల్పోయి.. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, 317 జీవోలో సవరణలు చేసేవరకూ ఉద్యోగుల పక్షాన సమిష్టిగా పోరాడాలని సీఎల్పీ సమావేశంలో నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది.
అలాగే.. ఉద్యోగ నోటిఫికేషన్‌పై నిరుద్యోగుల పక్షాన ఉద్యమించాలని సమావేశంలో కాంగ్రెస్ నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు.. రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. సెకండ్‌వేవ్ సమయంలో ప్రజలు పడ్డ ఇబ్బందులు.. మరోసారి పునరావృతం కాకుండా.. రాష్ట్ర సర్కార్ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించే అవకాశం ఉంది.