జనగామ కాంగ్రెస్‌లో వర్గపోరు
Congress: ప్రజల్లో ఉన్నవారికే టికెటన్న రాహుల్ గాంధీ
Congress: జనగామ జిల్లా లో కాంగ్రెస్ పార్టీ లో వర్గ పోరు తీవ్రమైంది. జనగామ నియోజకవర్గంలో కొన్ని రోజులుగా పార్టీ శ్రేణుల్లో అయోమయం నెలకొంటుంది. కాంగ్రెస్‌లోని సీనియర్ నాయకులు పొన్నాల లక్ష్మయ్య , మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి వేర్వేరుగా కుంపటి పెట్టుకుని సమావేశాలు, సభలు , యాత్ర లు ఎవరికీ వారే చేపడుతున్నారు. నేతల తీరుతో కార్యకర్తల్లో అయోమయం నెలకొంది.
వరంగల్ డిక్లరేషన్ సభలో రాహుల్ గాంధీ దిశ నిర్దేశంతో కాంగ్రెస్ నాయకులు జనంబాట పడుతున్నారు. వరంగల్ డిక్లరేషన్‌లో ఇచ్చిన ప్రధాన హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు యత్నిస్తున్నారు. జనగామ నియోజకవర్గంలో ఇద్దరు సీనియర్ నేతలు తగ్గేదే లే అన్నట్లు ఎవరి క్యాడర్‌తో వారు ప్రజల్లోకి వెళ్తున్నారు. రానున్న ఎన్నికల్లో టికెట్ ఎవరికి వస్తుందో తెలియదు కానీ... ఇద్దరు నేతలు గ్రామాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఒక్కటిగా ఉన్న స్థానిక నాయకులు రెండు వర్గాలుగా విడిపోయి నువ్వా.. నేనా అన్నట్లు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
కోమ్మూరి ప్రతాప్ రెడ్డి కొడవటూరు సిద్దేశ్వర దేవాలయంలో పూజలు నిర్వహించి రచ్చబండ ప్రారంభిస్తే పొన్నాల లక్ష్మయ్య కొమురవెల్లి మల్లిఖార్జున దేవస్థానం లో ప్రత్యేక పూజలు నిర్వహించి రచ్చబండ ప్రారంభించారు. రచ్చబండ కార్యక్రమాన్ని సైతం జనగామ నియోజకవర్గంలోని చేర్యాల,కొమురవెల్లి,మద్దూరు మండలాల్లో ఇరువురు నాయకులు వేరువేరుగా నిర్వహిస్తున్నారు. దీంతో ఎవరికి మద్దతు తెలుపాలో తెలియక కార్యకర్తలు , ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. వర్గపోరు కారణంగా జనగామ నియోజకవర్గంలో రైతులకు భరోసా కల్పించడంలో కాంగ్రెస్ పార్టీ విఫలం చెందుతుందేమోనని కార్యకర్తలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
పార్టీ నిబంధనలు పాటించని వారు ఎంత వారైన వేటు తప్పదని రాహుల్ వరంగల్ సభలో హెచ్చరించినా నాయకులు మాత్రం మారటం లేదు. 2014,2018 అసెంబ్లీ ఎన్నికల్లో రెండు సార్లు ఓటమి చవిచూసిన పొన్నాల మరోసారి తనకు అవకాశం కల్పించేలా నియోజకవర్గ పరిధిలోని మండలాల్లో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. రాహుల్ గాంధీ వరంగల్ సభ తర్వాత పొన్నాల నియోజకవర్గంలో డిక్లరేషన్ పై అవగాహన కల్పించి ప్రజలకు, రైతులకు దగ్గరవవ్వాలని చూస్తున్నారు.
కాంగ్రెస్ అధికారంలో ఉన్నన్ని రోజులు కీలక మంత్రి పదవుల్లో ఉండి టీపీసీసీ అధ్యక్షులుగా పని చేసిన పొన్నాల లక్ష్మయ్య 2018 అసెంబ్లీ ఎన్నికల అనంతరం నియోజక వర్గ ప్రజలకు, నాయకులకు టచ్ లో లేకుండా కేవలం భాగ్యనగరానికే పరిమితమయ్యారు. ఎన్నికలు రాక ముందే పరిస్థితి ఇలా ఉంటే మునుముందు ఎలా ఉంటుందోనని కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. పార్టీ నాయకత్వం ఎవరికీ టికెట్ కేటాయిస్తుందో వేచి చూడాలి.