పండుగ వస్తోంది..ఊరికి వెళ్లేదెలా?

Update: 2020-10-02 07:00 GMT

తెలంగాణ పెద్ద పండుగ దసరా దగ్గరపడుతోంది. పండుగ అనగానే ఎక్కడేక్కడికో వెళ్లిన వారంతా సొంతూళ్లకు పయనమవుతారు. వాళ్లందరిని ఊర్లకు తరలించడానికి ఆర్టీసీ, రైల్వేశాఖ ప్రత్యేక సర్వీసులను నడిపేది. కానీ ఇప్పుడు ఉన్న సర్వీసులను కూడా నడిపే పరిస్థితి లేకుండా పోయింది. లాక్ డౌన్ తర్వాత ఆర్టీసీ సేవలు ప్రారంభమైన కొన్ని సర్వీసులకు పరిమితం చేశారు. రైల్వేశాఖ కూడా కొన్ని రూట్లలో కొన్ని రైళ్లకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక ఈసారి దసరా ప్రయాణానికి బ్రేకుల పడిల్సిందేనా స్పెషల్ ట్రైన్స్ పక్కనపడితే రెగ్యూలర్ ట్రైన్స్ అన్న పట్టాలెక్కుతాయా..?

దసరా పండుగ అనగానే బతుకుదెరువు కోసం వచ్చిన వారందరికీ సొంతూరు గుర్తుకువస్తుంది. ఎలాగైనా పండుగకు ఇంటికి వెళ్లాలని తాపత్రయపడతారు. పండుగ నెల రోజు ఉండగానే రిజర్వేషన్ల కోసం పరితపిస్తారు. కానీ ఇప్పుడా ఆ సంబురాన్ని హుష్ కాకి చేసింది కరోనా మహమ్మారి. ప్రస్తుతం దేశంలో 350కి పైగా ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి. అవి ఏ మాత్రం సరిపోవడం లేదు. ఇక పండుగ వస్తే అంతే సంగతీ.

లాక్ డౌన్ తర్వాత ప్రభుత్వం అన్ని సేవలను పున: ప్రారంభించింది. కానీ బస్సు, రైళ్ల సర్వీసులను పూర్తిస్థాయిలో రన్ చేయలేక పోతోంది. సాధారణ రోజుల్లో హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి 20రైళ్లు నడిచేవి. ప్రస్తుతం మూడు రైళ్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ రైళ్ల లో ఇప్పటికే వెయిటింగ్ లిస్టు 300కు చేరుకుంది. సాధారణంగా హైదరాబాద్ నుంచి ప్రతిరోజు సుమారు 80 ఎక్స్ ప్రెస్ రైళ్లు, ప్యాసింజర్ రైళ్లు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించేవి. పండగ రోజుల్లో మరో 50- 75 రైళ్లు అదనంగా నడిచేవి. కానీ ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వేలో కేవలం 28 రైళ్లు మాత్రమే నడుస్తున్నాయి. మరో 12 రైళ్లు సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలోని పలు ప్రాంతాల మీదుగా వెళ్తున్నాయి. అక్టోబర్ 24న దసరా, నవంబర్ 14న దీపావళి అలాగే డిసెంబర్ లో క్రిస్మస్ జనవరిలో సంక్రాంతి ఇలా వరుసగా పండుగలు వస్తున్నాయి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో సొంతూళ్లకు ఎలా వెళ్లాలో అని నగరవాసులు ఆలోచనలో పడ్డారు.

Tags:    

Similar News