Telangana: వ్యవసాయ శాఖ అధికారులతో సీఎం కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష

Telangana: త్వరలో తెలంగాణలో కొత్త హార్టికల్చర్ విధానం * హార్టికల్చర్ యూనివర్శిటిని బలోపేతం చేయాలి- కేసీఆర్

Update: 2021-02-27 01:44 GMT

సీఎం కెసిఆర్ (ఫైల్ ఇమేజ్)

Telangana: తెలంగాణ నేపథ్యాన్ని, రాష్ట్ర అవసరాలు, నేలలు, వాతావరణాన్ని అనుసరించి హార్టికల్చర్ విధానాన్ని రూపొందించాలని సీఎం కేసీఆర్ వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఉద్యానవన పంటల సాగు మరింత విస్తరించే దిశగా పరిశోధనలు చేపట్టాల్సిన అవసరముందన్నారు. వ్యవసాయశాఖ ఉన్నతాధికారుల‌తో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించిన సీఎం కేసీఆర్.. హార్టికల్చర్ యూనివర్శిటీని బలోపేతం చేయాలని సూచించారు.

ఆధునిక పద్ధతుల్లో ఉద్యానవన పంటల సాగుకోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీని ఏర్పాటు చేయాలన్నారు సీఎం కేసీఆర్. ఇందుకు ఆచార్య జయశంకర్ వ్యవసాయ యూనివర్శిటీలోని 300 ఎకరాలను కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. ఉద్యానవన విశ్వవిద్యాలయం అభివృద్ధికి బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తామని స్పష్టం చేశారు. వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలల్లో సీట్ల సంఖ్య పెంచాలని ఆదేశించారు సీఎం.

ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయరంగం మూస పద్ధతిలో సాగిందన్న సీఎం.. వరి పంటకే ఆనాటి ప్రభుత్వాలు ప్రాధాన్యతనిచ్చాయని తెలిపారు. సాగునీటి కొరత తీవ్రంగా ఏర్పడి తెలంగాణలో వ్యవసాయం వెనకబడిపోయింద‌న్నారు. కానీ ఇప్పుడు వ్యవసాయ రంగంలో తెలంగాణ అగ్రగామి దిశగా ముందుకు సాగుతుందన్నారు. తక్కువ నీటి వాడకంతో ఎక్కువ లాభాలు ఆర్జించేలా ఉద్యానవన పంటల సాగును ప్రోత్సహించాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు సీఎం కేసీఆర్. ఉద్యానవన నర్సరీలు ఏర్పాటు చేసే వారికి రైతుబంధుతో పాటు ప్రత్యేక ప్రోత్సాహాకాలు అందించేలా అధికారులు కార్యాచరణ రూపొందించాలని తెలిపారు.

Tags:    

Similar News