చార్మినార్ ఆస్పత్రిలో ఓపీ సేవలు పున:రుద్దరించాలంటున్న రోగులు

Update: 2020-09-16 05:24 GMT

ప్రభుత్వ నిజామియా జనరల్ హాస్పిటల్ అదే నండి నగరంలోని ప్రసిద్ధ యునాని ఆసుపత్రిని ఎప్పుడైనా కోవిడ్ కేంద్రంగా మార్చివేసారో అప్పటి నుంచి ఇతర వ్యాధులతో భాధపడుతున్న రోగులకు ఆ దరిదాపుల్లోకి రానివ్వడంలేదు. దీంతో దీర్ఘకాల రోగాలతో బాధపడుతున్న వారు ఎప్పుడెప్పుడు ఈ ఆస్పత్రిలో ఓపీ సేవలు మొదలవుతాయో అని ఎదురుచూస్తున్నారు. చార్మినార్ దవాఖానాగా ప్రసిద్ది చెందిన నిజామియా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ మార్చి నెలలో కరోనా బాధితులకు క్వారంటైన్ కేంద్రంగా మార్చబడింది. అప్పటి నుంచి సాధారణ రోగులను అనుమతించడంలేదు. అయితే లాక్డౌన్ సడలింపుల తరువాత, యునాని వైద్యం చేయించుకునే రోగులు వైద్యం కోసం ఆస్పత్రికి రావడం ప్రారంభించారు. అయితే గత రెండు మూడు నెలల నుంచి ఆస్పత్రిలో కరోనా రోగులకు చేర్చుకోవడం అలాగే కోవిడ్ పరీక్షలు మాత్రమే నిర్వహించడంతో ఇతరులను అనుమతించడంలేదు. దీంతో రోగులు వెంటనే యునానీ ఆస్పత్రిలో వైద్య సేవలు కొనసాగించాలని వైద్య అదికారులను కోరుతున్నారు.

ఇక పోతే నగరంలోనే ఇన్-పేషెంట్ వార్డ్ కలిగిన ప్రభుత్వ నిజామియా జనరల్ హాస్పిటల్ ఇదొక్కటే. ఆ ఆసుపత్రిలో ప్రతి రోజు సుమారుగా 1,200 మంది ఓపీ పేషెంట్లు వస్తుంటారు. అంతే కాదు రోజుకు 150 కి పైగా మహిళలు స్త్రీ వైద్య నిపుణులను సంప్రదిస్తుంటారు. 180 పడకల ఈ ఆసుపత్రి ఎప్పుడూ రోగులతో కిటకిట లాడుతూనే ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఆస్పత్రిని కోవిడ్ కేంద్రంగా మార్చి మూసివేసారో అప్పటి నుంచి చాలా మంది రోగులు ఫోన్ కాల్‌ ద్వారా మాత్రమే వైద్యులను సంప్రదిస్తున్నారు. ఇక పోతే కొంత మంది రోగులు మాట్లాడుతూ అన్‌లాక్ 1.0 ప్రక్రియ ప్రారంభం అయిన నాటి నుంచి కరోనా వైరస్ అనుమానిత రోగులు ఆసుపత్రిలో చేరలేదని అంటున్నారు. అలాంటప్పుడు ఓపీ పేషెంట్లను ఎందుకు అనుమతించడంలేదంటూ వైద్యాధికారులను సంప్రదిస్తున్నారు. ఫిజియోథెరపీ, మసాజ్ లాంటి చికిత్సలు లేకపోవడంతో పక్షవాతం వచ్చిన రోగులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని వారు పేర్కొంటున్నారు. ప్రయివేటు ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకోవాలంటే భారీ మొత్తాలను వసూలు చేస్తున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఆస్పత్రిలో వైద్యం సదుపాయం కల్పించాలని రోగులు కోరుతున్నారు.

Tags:    

Similar News