పార్లమెంట్ ఎన్నికల్లో కారుకు బ్రేకులు.. పార్టీ స్థాపించిన తర్వాత మొదటి సారి..

మొట్టమొదటి సారి గులాబీ పార్టీకి లోక్‌సభలో సభ్యులు లేకుండాపోయారు.

Update: 2024-06-04 13:54 GMT

పార్లమెంట్ ఎన్నికల్లో కారుకు బ్రేకులు.. పార్టీ స్థాపించిన తర్వాత మొదటి సారి..

పార్టీ స్థాపించిన తర్వాత తొలిసారి బీఆర్ఎస్‌కు ఘోర పరాభవం ఎదురైంది. టీఆర్ఎస్ ఆవిర్భవం తర్వాత వచ్చిన ప్రతీ పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం రెండు ఎంపీ సీట్లు అయినా గెలుస్తూ వచ్చినా.. ఈ సారి మాత్రం చుక్కెదురైయింది. ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క ఎంపీ సీటు కూడా బీఆర్ఎస్ గెలుచుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది. దేశ రాజకీయాల్లో కీలక భూమిక పోషించాలని ఉవ్విల్లూరిన కేసీఆర్‌.. కనీసం ఒక్క ఎంపీ అభ్యర్థిని కూడా గెలిపించుకోలేకపోయారు.

మొట్టమొదటి సారి గులాబీ పార్టీకి లోక్‌సభలో సభ్యులు లేకుండాపోయారు. రాష్ట్రంలో బీజేపీ,కాంగ్రెస్ మధ్య హోరా హోరీ పోరు జరగగా... ఈ పోటీలో బీఆర్ఎస్ పార్టీ కనీసం ప్రభావం చూపలేకపోయింది. 2014, 2019 ఎన్నికల్లో దూసుకుపోయిన కారుకు 2024 ఎన్నికల్లో సడన్ బ్రేక్ పడింది. ఒక్కటంటే ఒక్క సీటులో కూడా విజయం సాధించలేక గులాబీ పార్టీ చతికిలపడింది.

మెదక్ ఎంపీ స్థానంలో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని అంతా భావించినా.. అక్కడా పరాభవం తప్పలేదు. దుబ్బాక, గజ్వేల్, సిద్ధిపేట వంటి బీఆర్ఎస్ ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ నియోజకవర్గాలు మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్నా.. బీఆర్ఎస్ ఓటమి అనివార్యంగా మారింది.

మెదక్‌లో బీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ హరీశ్ రావు విస్తృతంగా ప్రచారం నిర్వహించినా ఫలితం లేకుండా పోయింది. వైఎస్ఆర్ హవాలో కూడా మెదక్ స్థానంలో కారు పార్టీ విజయం సాధించినా.. ఈ సారి మాత్రం ఆ స్థానంలో బీజేపీ జెండా ఎగిరింది. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోవడంతో...ఆ ప్రభావం పార్లమెంట్ ఎన్నికలపై పడి బీఆర్ఎస్‌కు వ్యతిరేక ఫలితాలు వచ్చేలా చేశాయని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.

కేసీఆర్ కుటుంబం పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయకపోవడం కూడా ఇదే తొలిసారి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు దేశ రాజకీయాల్లో కీలక భూమిక పోషిస్తామని.. మహారాష్ట్ర, ఏపీలో కూడా పోటీ చేస్తామంటూ పార్టీ ఆఫీసులు ఓపెన్ చేసిన కేసీఆర్‌కు ఇప్పుడు స్వరాష్ట్రం ఒక్క సీటు దక్కపోవడం చర్చనీయాంశమైంది.

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్,బీజేపీ మధ్య నువ్వా-నేనా అన్న రేంజ్‌లో పోటీ నడిచింది. రెండు పార్టీలకు సిట్టింగ్ ఎంపీ స్థానాలు ఉండటంతో ఆ స్థానాలతో పాటు బీఆర్ఎస్ ప్రాతినిథ్యం వహిస్తున్న సీట్లను కైవసం చేసుకునేందుకు రెండు పార్టీలు పోటీ పడ్డాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీలు తెలంగాణపై పట్టు నిలుపునేందుకు లోక్ సభ ఎన్నికలను వేదికగా మార్చుకున్నాయి. ఈ రెండు పార్టీల బలాల ముందు బీఆర్ఎస్ నిలవలేకపోయింది.

అయితే తెలంగాణలో మొత్తం 17 పార్లమెంట్ స్థానాలకు గానూ బీజేపీ,కాంగ్రెస్ పార్టీల్లో ఏ ఒక్క పార్టీకి డబుల్ డిజిట్ రాలేదు. రెండు పార్టీలు సింగిల్ డిజిట్‌కే పరిమితమైయ్యాయి. పార్లమెంట్ ఎన్నికల్లో హవా తమదేనని రెండు పార్టీలు విస్తృతంగా ప్రచారం చేసినా.. తెలంగాణ ఓటరు మాత్రం రెండు పార్టీలను సింగిల్ డిజిట్‌కే పరిమితం చేసిన సమన్యాయం పాటించారు.

Tags:    

Similar News