అలంపూర్ నుంచి ప్రారంభమైన ప్రజా సంగ్రామ యాత్ర
BJP Praja Sangrama Yatra: టీఆర్ఎస్ పాలనపై సమర శంఖారావం పూరించిన సంజయ్
BJP Praja Sangrama Yatra: బీజేపి రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన రెండో దశ ప్రజా సంగ్రామ యాత్ర జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నుంచి ఘనంగా ప్రారంభమైంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని 9 నియోయోజకవర్గాలు రంగారెడ్డి జిల్లాలోని ఒక నియోజకవర్గం కలిపి మొత్తం 10 నియోజకవర్గాల్లో 31 రోజుల పాటు ఈ ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగనుంది. ఐదవ శక్తిపీఠమైన జోగులాంబ అమ్మవారి ఆశీసులతో టీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపి కదం తొక్కుతూ ఎన్నికల ప్రచార సంగ్రామానికి సమరం మ్రోగించింది కాషాయదళం. రాష్ట్ర బీజేపి నాయకులంతా ఈ యాత్ర ప్రారంభ సభలో పాల్గొని కేసీఆర్ పాలనపై ధ్వజమెత్తారు.
బీజేపి రాష్ట్ర రథసారధి బండి సంజయ్ చేపట్టిన రెండో దశ ప్రజా సంగ్రామ యాత్ర జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నుంచి ప్రారంభమైంది. గురువారం సాయంత్రం అలంపూర్ లోని బాల భ్రహ్మేశ్వర, ఐదో శక్తి పీఠమైన జోగులాంబ అమ్మవారికి పూజలు చేసిన అనంతరం అక్కడి నుంచే టీఆర్ఎస్ పాలనపై సమర శంఖారావం పూరించారు బండి సంజయ్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి తరుణ్ చుగ్, బీజేపి నేతలు విజయశాంతి, ఈటెల రాజేందర్, డికే అరుణలతో పాటు రాష్ట్ర బీజేపి నేతలందరు యాత్ర ప్రారంభ సభలో పాల్గొని కేసీఆర్ పాలనపై విరుచుకుపడ్డారు. బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ హిందువులను అవమానించిన వారి కేసులను తిరగ తోడుతామన్నారు. సీఎం సంచుల మూటలు తీసుకుని ఢిల్లీలో తిరుగుతున్నాడని, ఆర్డీఎస్ ను ఎందుకు ఆధునీకరించలేదని ప్రశ్నించారు. బీజేపీ పాలనలో ఉచిత విద్య, వైద్యం అమలు చేస్తామని, సంగ్రామ యాత్ర ద్వార కేంద్రప్రభుత్వ పథకాలు ప్రజలు వివరిస్తామన్నారు బండి సజయ్.
బహిరంగ సభ ముగిసిన అనంతరం అలంపూర్ నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో గల ఇమామ్ పూర్ గ్రామం వరకు మొదటి రోజు పాదయాత్ర కొనసాగింది. అక్కడ రాత్రి బస చేశారు బండి సంజయ్ రెండో రోజు బండి సంజయ్ పాద యాత్ర 13 కిలోమీటర్ల మేర కొనసాగనుంది. అలంపూర్ మండలంలోని ఇమాంపూర్ నుంచి ప్రారంభమై లింగన్ వాయ్, బూడిదపాడు సెంటర్, ఉండవెళ్లి, కంచిపాడ్, తక్కిశిల, ప్రాగటూరు బస్టాండ్ వరకు కొనసాగనుంది.
జోగులాంబ గద్వాల జిల్లాలోని సాగునీటి సమస్య, పెండింగ్ ప్రాజెక్టులు, రైతు సమస్యలపై బండి సంజయ్ ప్రసంగిస్తూ యాత్ర కొనసాగించనున్నారు. ఐతే ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావిస్తూ ప్రజల అభిప్రాయాలను సేకరిస్తూ యాత్ర ముందుకు సాగనుంది. కాగా టీఆర్ఎస్ పార్టీ స్థాపించిన రోజుల్లో నాటి ఉద్యమ నేత కేసీఆర్ జోగులాంబ ఆలయం నుంచే తన పాదయాత్ర ప్రారంభించి గద్వాలలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఇప్పుడు బండి సంజయ్ చేపట్టిన యాత్ర కూడా ఇక్కడి నుంచే ప్రారంభం కావడం ప్రారంభ సభకు అధిక సంఖ్యలో జనాలు తరలి రావడంతో రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతుంది బీజేపి ప్రజా సంగ్రామ యాత్ర.