BJP MP Bandi Sanjay : భారతీయ జనతా పార్టీ శ్రేణుల్లో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అస్వస్థతకు గురయ్యారన్న వార్తలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. బీజేపీ అధ్యక్షుడు సెల్ఫ్ క్వారన్ టైన్లో ఉన్నారని, అనారోగ్య సమస్యతో ప్రస్తుతం ఆయన ఎయిమ్స్‌లో చేరినట్లు సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీంతో పార్టీశ్రేణులు ఒకింత ఆందోళనకు గురవుతున్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు కృష్ణదాస్‌కు ఇటీవలే కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అయితే ఎంపీ బండి సంజయ్ ఆయనతో ప్రైమరీ కాంటాక్ట్ అయినట్లు తెలుస్తోంది. అప్పటి నుంచి ఆయన హోం క్వారంటైన్ ఉన్నారని, స్వల్ప అస్వస్థతకు గురయ్యారని సన్నితులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు నేతలు ఆయన ఆరోగ్యంపై ఆందోళనకు గురవుతున్నారు. ఇక పోతే ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఎంతో మంది అధికార పార్టీ నాయకులు, ప్రతిపక్ష పార్టీ నాయకులు, అధికారులు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. అయితే వారు సరైన సమయానికి చికిత్స తీసుకుని కరోనాను కూడా జయించారు.
బండి సంజయ్ జులై 11, 1971 న శకుంతల, నర్సయ్య దంపతులకు జన్మించాడు. బండి సంజయ్ నాన్న ప్రభుత్వ టీచర్‌గా పని చేసేవాడు. సంజయ్ ను అయన తండ్రి ఒకటో తరగతిలోనే సరస్వతి శిశుమందిర్ లో చేర్పించాడు, అప్పటినుండే అయన ఆర్‌ఎస్‌ఎస్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాడు. బండి సంజయ్ ఆర్‌ఎస్‌ఎస్‌లో ఘటన్ నాయక్‌గా, ముఖ్య శిక్షక్‌గా ప్రాథమిక విద్యా స్థాయిలోనే పనిచేశాడు. 1996లో బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ సురాజ్ రథయాత్ర సమయంలో అప్పటి మెట్‌పల్లి ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు, బిజెపి సీనియర్ నాయకుడు వెంకయ్యనాయుడు ఆయనకు అద్వానీ రథయాత్ర వాహన శ్రేణికి ఇన్‌చార్జిగా నియమించారు. ఎన్నికల నేపథ్యంలో అద్వానీ రథయాత్ర నిలిచిపోవడంతో బండి సంజయ్‌ను ఢిల్లీ సెంట్రల్ ఆఫీస్‌లో సహాయక్‌గా నియమించారు.