కాషాయం క్యాంప్‌లో ఈటల అసంతృప్తి పెరుగుతోందా.. సపోర్ట్ చేసి తప్పు చేశారా?

Etela Rajender: కమలం క్యాంప్‌లో ఈటలపై అసంతృప్తి పెరుగుతోందా? వద్దన్నా విన్నకుండా ఈటల దూకుడు ప్రదర్శిస్తున్నారని గుస్సా పెంచుకుందా?

Update: 2021-12-17 10:47 GMT

కాషాయం క్యాంప్‌లో ఈటల అసంతృప్తి పెరుగుతోందా.. సపోర్ట్ చేసి తప్పు చేశారా?

Etela Rajender: కమలం క్యాంప్‌లో ఈటలపై అసంతృప్తి పెరుగుతోందా? వద్దన్నా విన్నకుండా ఈటల దూకుడు ప్రదర్శిస్తున్నారని గుస్సా పెంచుకుందా? కరీంనగర్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రవీందర్‌సింగ్‌కు బ్యాంక్ఎండ్‌ సపోర్ట్ ఎందుకు చేశారంటూ ఈటలను కార్నర్‌ చేస్తున్నది ఎవరు? హుజూరాబాద్‌ గెలుపు హైప్‌తో ఏదో సుప్రీం అనుకుంటే పొరపాటని, హైకమాండ్‌ ముందు ఎవరైనా ఒకటేనంటూ టార్గెట్‌ చేస్తున్నది ఎవరు? కొందరు కమలనాథులు కలవరపడుతుంటే మరికొందరు కారాలు మిరియాలు ఎందుకు నూరుతున్నారు? హుజూరాబాద్‌లో గులాబీ రంగుకు కాషాయం కలర్‌ వేసిన ఈటలపై కమలం పార్టీలో జరుగుతున్న తాజా చర్చ ఏంటి?

ఈటల రాజేందర్‌. హుజూరాబాద్‌ ఎమ్మెల్యే. కమలం పార్టీ గ్రాఫ్‌ను, వ్యక్తిగతంగా తన ఇమేజ్‌ని అమాంతం పెంచుకున్న నాయకుడు. కాషాయం పార్టీలో కలరింగ్‌ ఇస్తున్నారని ప్రచారం జరుగుతున్న వేళ ఈటలపై తాజాగా ఓ అసంతృప్తి వ్యక్తమవుతోందట. ఇప్పటికే తమకు పోటీగా ఈటల పావులు కదుపుతున్నారన్న ఆందోళనలో ఉన్న కమలం పార్టీ సీనియర్లు అందివచ్చిన ఈ అవకాశాన్ని అస్త్రంగా మలుచుకోబోతున్నారన్న టాక్‌ జోరుగా వినిపిస్తోంది. మరీ ముఖ్యంగా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వద్దన్నా వినకుండా ఈటల తీసుకున్న ఓ నిర్ణయాన్ని ఏకపక్షంగా తప్పుపడుతున్నారట.

కరీంనగర్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ రెబెల్‌ అభ్యర్థిగా దిగిన మాజీ మేయర్‌ సర్దార్‌ రవీందర్‌సింగ్‌ విషయంలో కమలం పార్టీ సీరియస్‌గా ఉందన్న చర్చ జరుగుతోంది. తనకు ముఖ్య అనుచరుడిగా ఉన్న రవీందర్‌సింగ్‌ను ఎలాగైనా కమలం క్యాంప్‌లోకి లాగి గులాబీపార్టీకి భారీ షాక్‌ ఇద్దామనుకుంటే అది అటు ఇటు తిరిగి బూమారాంగ్‌ అయిందని ఈటలపై గుస్సా మీద ఉన్నారట. అన్ని విధాల సర్దార్‌కు సపోర్ట్‌ చేసిన ఈటల ఎలాగైనా సింగ్‌ గెలిపించి, కింగ్‌ చేద్దామని అనుకున్నారట. దానికి అనుగుణంగానే చాలానే మద్దతు ఇచ్చారట. అర్థబలంతో పాటు, అంగబలాన్ని, ఆర్థికబలాన్ని కూడా రవీందర్‌సింగ్‌కు ఇచ్చారని, అయినా గెలిపించుకోలేకపోయారన్న టాక్‌ ఒకటి బలంగా వినిపిస్తోంది.

వాస్తవానికి, తెలంగాణలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎక్కడా కూడా పోటీ చేయకూడదని కమలం అధినాయకత్వం నిర్ణయించింది. ఈ మేరకు క్యాడర్‌ ఓ ప్రకటన కూడా పంపింది. ఏ స్థానంలో కూడా ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ, మద్దతు ఇవ్వకూడదు సంఘీభావం తెలపకూడదంటూ ఫత్వా కూడా జారీ చేసింది. కానీ ఇవ్వని ఏమాత్రం పట్టించుకోని ఈటల డైరెక్ట్‌గా కాకపోయినా, ఇన్‌డైరెక్ట్‌‌గా కరీంనగర్‌ స్థానిక సంస్థల కోటాలో రవీందర్‌‌ను నిలబెట్టి అధినాయకత్వం ఫత్వాను బేఖాతరు చేసినంత పని చేశారన్న చర్చ కమలం పార్టీలో జోరుగా జరుగుతోంది.

కరీంనగర్‌ మేయర్‌గా ఉన్నప్పుడు జిల్లా రాజకీయాలను శాసించిన రవీందర్‌సింగ్‌ ఈటల టీఆర్ఎస్‌లో ఉన్నప్పుడు ముఖ్య అనుచరుడిగా చక్రం తిప్పారు. కరీంనగర్‌ జిల్లాలో ఎక్కడేం జరుగుతుందో ఎప్పటికప్పుడు ఈటలకు ఉప్పందించిన సింగ్‌ రాజేందర్‌ బీజేపీలో చేరడంతో తాను కూడా రూటు మార్చారు. అధికార పార్టీతో అంటీముట్టనట్టుగా ఉన్నారు. కమలం పార్టీతో డైరెక్ట్‌గా కాకపోయినా పరోక్షంగా అంటకాగారు. ఒక కాజ్‌ ఉండాలి కాబట్టి కారు పార్టీపై దుమ్మెత్తి పోశారు. టీఆర్ఎస్‌ పార్టీలో ఉద్యమకారులకు చోటు లేదంటూ ఎదురదాడికి దిగారు. అయినా కారు పార్టీ నుంచి ఎలాంటి సానుకూల సందేశాలు రాకపోవడంతో రెబెల్‌ క్యాండిడేట్‌గా ఎమ్మెల్సీ అభ్యర్థిత్వానికి పోటీ పడ్డారు. దానికి ఈటల మద్దతు ఇచ్చారన్నది ఓపెన్‌ సీక్రెటే అయినా సింగ్‌ మాత్రం కరీంనగర్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కింగ్‌ కాలేకపోయారు.

సరిగ్గా ఇదే అస్త్రాన్ని ఈటలపై ప్రయోగించేందుకు కమలం పార్టీ సన్నద్ధం అవుతుందట. ఈటల సపోర్ట్‌తో రవీందర్‌సింగ్‌ నెగ్గితే పరిస్థితి వేరేలా ఉండేదని, అలాంటిది, ఆయనకు పరోక్షంగా సపోర్ట్‌ చేసిన ఈటల పార్టీ పరువు తీశారన్న అభిప్రాయంతో ఉన్నారట కమలనాథులు. ఇది ఇలాగే కొనసాగితే, పార్టీ నాయకత్వానికి, సీనియర్ల అనుభవానికి విలువ లేకుండా పోతుందన్న అంచనాతో ఉన్న కొందరు నేతలు ఈటలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. ఇప్పటికే హుజూరాబాద్‌ గెలుపు తన వ్యక్తిగత ఇమేజ్‌తోనే సాధ్యమైందని, అందులో తాను చేరిన బీజేపీకి సంబంధం లేదన్నట్టుగా ఈటల వర్గం చేస్తున్న ప్రచారంతో లోలోపల తెగ ఇదై పోతున్న కమలనాథులు ఈ విషయంలో ఈటల తీసుకున్న నిర్ణయాన్ని ఫిర్యాదు రూపంలో హైకమాండ్‌కు నివేదిక అందచేయనున్నట్టు సమాచారం. మరి కమలం క్యాంప్‌లో ఈటల లొల్లి ఎలా సద్దుమణుగుతుందో ఎవరు సద్దుమణిగిస్తారో చూడాలి.

Tags:    

Similar News