BJP fires on Asaduddin Owaisi: మాజీ ప్రధానిపై ఓవైసీ సంచలన విమర్శలు.. బీజేపీ ఫైర్!
BJP fires on Asaduddin Owaisi: దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి వేడుకలను తెలంగాణ సర్కారు ఏడాది పాటు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే.
BJP fires on Asaduddin Owaisi: దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి వేడుకలను తెలంగాణ సర్కారు ఏడాది పాటు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. జూన్ 28న పీవీ జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్ పీవి దేశానికి చేసిన సేవలను కొనియాడారు. కాగా టీఆర్ఎస్ మిత్రపక్షమైన ఎంఐఎం మాత్రం అందుకు విరుద్ధంగా స్పందిస్తోంది. అంతే కాదు పీవీ శత జయంతి వేడుకలు ఏడాదిపాటు నిర్వహించాలని టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల కూడా ఏఐఎంఐఎం సానుకూలంగా స్పందించలేదు. బీజేపీ తొలి ప్రధాని పీవీ నరసింహారావు అని స్కాలర్ ఏజీ నూరానీ సరిగా చెప్పార''ని ఎంఐంఎం ట్వీట్ చేసింది. కాంగ్రెస్ చరిత్రలోనే వివాదశీల నేతగా పీవీని అసదుద్దీన్ ఓవైసీ అభివర్ణించారు. పీవీ అధికారంలో ఉన్న సమయంలో ఆయన్ని విమర్శిస్తూ ఓ న్యూస్ పేపర్ రాసిన న్యూస్ ఆర్టికల్‌ను కూడా ఓవైసీ తన ట్వీట్‌కు అటాచ్ చేశారు. అంతే కాదు పీవీ ఆర్థికవేత్త కాదు, సంఘ సంస్కర్త కూడా కాదంటూ ఓవైసీ ట్వీట్ చేశారు. బాబ్రీ కూల్చివేతపై ఓ పుస్తకాన్ని కోట్ చేస్తూ.. ''ఏం అవార్డులు ఇచ్చారనేది ముఖ్యం కాదు. ఓ ప్రధానిగా ఉండి బాబ్రీ మసీదు కూల్చివేతకు అనుమతిచ్చిన, అదే ప్రదేశంలో ఆలయ నిర్మాణానికి సహకరించిన వ్యక్తిగా చరిత్ర పీవీని గుర్తుంచుకుంటుందని అన్నారు. యూపీఏ-1లో భాగస్వామిగా ఉన్న ఎంఐఎం.. 2008లో మసాబ్ ట్యాంక్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వెళ్లే ఎక్స్‌ప్రెస్ వేకు పీవీ పేరు పెట్టడాన్ని వ్యతిరేకించింది.
ఇక పోతే పీవీపై ఓవైసీ చేసిన వ్యాఖ్యల పట్ల బీజేపీ మండిపడింది. అలాంటి గొప్ప వ్యక్తిపై చౌకబారు విమర్శలు చేయడం తగదన్నారు. తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డగా పీవీకి ఎంఐఎం గౌరవం ఇవ్వాలన్నారు. అసద్ వ్యాఖ్యలు ఎంఐఎం సంకుచిత మనస్తత్వాన్ని తెలియజేస్తున్నాయని బీజేపీ తెలంగాణ అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ విమర్శించారు. బాబ్రీ కూల్చివేతకు పీవీకి సంబంధం లేదన్న బీజేపీ నేత.. కావాలనే ఆయనపై విమర్శలు గుప్పించడం సరికాదన్నారు. హైదరాబాద్ రాష్ట్రంలో రజాకర్లు, నిజాం పాలనను పీవీ వ్యతిరేకించారని బీజేపీ నేత చెప్పారు. బాబ్రీ మసీదు వివాదాన్ని సుప్రీం కోర్టు పరిష్కరించిన తర్వాత కూడా ఇప్పుడెందుకు ప్రస్తావించడమని ఆయన ప్రశ్నించారు. పీవీ దేశానికి చేసిన సేవలకు గానూ ప్రధాని సహా అన్ని పార్టీలూ ప్రశంసిస్తున్నాయని.. కానీ ఓవైసీ చీప్ పబ్లిసిటీ కోసం పీవీని విమర్శిస్తున్నారని సుభాష్ ఆరోపించారు.