Bandi Sanjay: నేటి నుంచి బీజేపీ ప్రజా సంగ్రామ యాత్ర
Bandi Sanjay: అలంపూర్ నుంచి బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభం
Bandi Sanjay: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర నేటి నుంచి ప్రారంభం కానుంది. జోగులాంబ ఆలయం నుంచి ఆయన పాదయాత్ర మొదలు పెట్టనున్నారు. మొత్తం 31 రోజుల పాటు 8 నియోజకవర్గా్ల్లో పాదయాత్ర సాగనుంది. అవినీతి, నియంత, కుటుంబ పాలన నిర్మూలనే లక్ష్యంగా పాదయాత్ర చేస్తున్నట్లు బండి సంజయ్ ప్రకటించారు. గురువారం ఉదయం హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత జోగులాంబకు బయలుదేరి వెళతారు. మధ్యాహ్నం 3 గంటలకు అలంపూర్‌లోని జోగులాంబ అమ్మవారిని అగ్రనేతలు దర్శించుకుంటారు. సాయంత్రం భారీ బహిరంగసభతో ప్రజల్లోకి వెళ్లనున్నారు కలమదళపతి. బహిరంగ సభలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో పాటు పార్టీ ముఖ్య నేతలు పాల్గొననున్నారు. సభ అనంతం మొదటి రోజు నాలుగు కిలోమీటర్లు పాదయాత్ర చేయనున్నారు బండి సంజయ్.
రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర అలంపూర్‌లో ప్రారంభమై గద్వాల, మక్తల్, నాగర్ కర్నూల్, జడ్చర్ల , మహబూబ్ నగర్, దేవరరకద్ర, నారాయణపేట, కల్వకుర్తి మీదుగా మహేశ్వరం వరకు సాగనుంది. ప్రతి రోజు ఉదయం 8 గంటలకు పాదయాత్ర ప్రారంభమై ఉదయం 11 గంటలకు ముగుస్తుంది. తర్వాత మధాహ్నం 3 గంటలకు ప్రారంభమై రాత్రి 8 గంటల వరకు పాదయాత్ర కొనసాగనుంది. రోజుకు 13 కిలోమీటర్ల చొప్పున మొత్తం 386 కిలోమీటర్లు బండి సంజయ్ పాదయాత్ర చేయనున్నారు. 31 రోజుల అనంతరం మహేశ్వరంలో ప్రజా సంగ్రామ యాత్ర ముగియనుంది. పాదయాత్ర కోసం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ప్రజా సంగ్రామ పాదయాత్రలో జాతీయ నేతలు, కేంద్ర మంత్రులు భాగస్వాములయ్యేలా ప్లాన్ రెడీ చేశారు. పాలమూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి జన సమీకరణకు నాయకులు ఏర్పాట్లు చేశారు.
పాదయాత్రను బీజేపీ నాయకత్వం సీరియస్‌గా తీసుకుంది. తెలంగాణలో ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చన్న ప్రచారంతో పాదయాత్రనే ప్రచారంగా మలుచుకోవాలని డిసైడ్ అయ్యారు. మొదటి విడత పాదయాత్రలో ప్రజలను కలిసిన బండి సంజయ్ రెండో విడత యాత్రలో ప్రజా సమస్యలు తెలుసుకోవడంతో పాటు గ్రామస్తులతో మమేకం కానున్నారు. ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకోవాలని టీఆర్ఎస్ చూస్తోందని రైతుల ముసుగులో దాడులు చేయించేందుకు కుట్ర పన్నుతోందని బండి సంజయ్ ఆరోపించారు. రెచ్చగొట్టేలా స్కెచ్‌లు వేస్తున్నారని కార్యకర్తలు సంయమనం పాటించాలని సూచించారు. పాదయాత్ర ద్వారా టీఆర్ఎస్‌ను గద్దె దించి ప్రజలు కోరుకునే ప్రజాస్వామిక తెలంగాణ ఏర్పాటుకు అడుగులు వేయాలని బీజేపీ భావిస్తోంది.