Secunderabad: సికింద్రాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం

Secunderabad: ఎలక్ట్రిక్ బైక్ షోరూమ్‌లో ఎగిసిపడ్డ మంటలు

Update: 2022-09-13 01:11 GMT

Secunderabad: సికింద్రాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం

Secunderabad: సికింద్రాబాద్ మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఉన్న ఎలక్ట్రిక్ బైక్ షోరూమ్‌లో దట్టమైన పొగ, మంటలు ఎగిసిపడ్డాయి. ప్రమాదంలో ఆరుగురు చనిపోగా... పలువురికి గాయాలయ్యాయి.

గ్రౌండ్ ఫ్లోర్ లో ఎలక్ట్రిక్ బైక్ షోరూమ్, నాలుగు అంతస్తుల్లో రూబీ హోటల్, లాడ్జి నిర్వహిన్నారు. ఎలక్ట్రిక్ బైక్ షోరూమ్‌లో భారీ ఎత్తున మంటలు , పొగ వ్యాపించాయి. మంటలు , పొగ పైన ఉన్న లాడ్జిలకు వ్యాపించాయి. దీంతో కొందరు కిటికీల కిందికి దూకి ప్రాణాలు దక్కించుకున్నారు.

ప్రమాద విషయం తెలుసుకున్న ఫైర్, పోలీస్, ఆర్డీఎఫ్, 108 సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. వీరు వచ్చే లోపే స్థానికుల కొంతమందిని కాపాడారు. ఫైర్ సిబ్బంది ఫైర్ లిఫ్ట్ సహాయంతో లాడ్జిలో చిక్కుకున్న వారిని కిందికి తీసుకువచ్చి 108 వాహనాల్లో గాంధీ, యశోద ఆసుపత్రులకు తరలించారు.

ఘటనా స్థలాన్ని మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, ఫైర్ సేఫ్టీ డీజీ సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ఫైర్ అధికారులతో మాట్లాడి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. లాడ్జిలో 24 మంది ఉండగా... మహిళతో సహా ఆరుగురు చనిపోయారు. మరో 15 మందిని కాపాడి ఆసుపత్రులకు తరలించారు. ఇందులో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. రెస్క్యూ ఆపరేషన్ చేపట్టిన సిబ్బంది కూడా అస్వస్థతకు గురయ్యారు.

అగ్ని ప్రమాదంతో గ్రౌండ్ ఫ్లోర్‌లోని ఎలక్ట్రిక్ బైక్‌లు పూర్తిగా కాలిపోయాయి. ఎలక్ట్రిక్ బైక్‌లకు చార్జింగ్ పెట్టడం వల్లే అవి పేలి ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. అగ్ని ప్రమాదంతో భవనంలోని లిఫ్ట్ ఆగిపోయింది.

దట్టమైన పొగ పీల్చి ఊపిరి ఆడక ఆరుగురు చనిపోయారని సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. బ్యాటరీల వల్ల ప్రమాదం జరిగిందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తామన్నారు. ప్రమాద బాధితుల్లో నార్త్ ఇండియన్స్ ఎక్కువగా ఉన్నారని సీపీ చెప్పారు.

సికింద్రాబాద్ అగ్ని ప్రమాద ఘటన బాధకరమని మంత్రి మహమూద్ అలీ అన్నారు. గాయపడిన వారికి గాంధీ ఆసుపత్రిలో మెరుగైన చికిత్స అందిస్తామన్నారు. ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశిస్తామని చెప్పారు.

Tags:    

Similar News