రూ.1కోటీ, 10 లక్షల వ్యయంతో భద్రాద్రి కళ్యాణోత్సవం ఏర్పాట్లు.. 2 టన్నుల తలంబ్రాలు, 15 టన్నుల ముత్యాలు

Badrachalam: ఏప్రిల్ 10న స్వామివారి కళ్యాణం, 11న శ్రీరామ పట్టాభిషేకం ...

Update: 2022-03-19 06:50 GMT

రూ.1కోటీ, 10 లక్షల వ్యయంతో భద్రాద్రి కళ్యాణోత్సవం ఏర్పాట్లు.. 2 టన్నుల తలంబ్రాలు, 15 టన్నుల ముత్యాలు

Badrachalam: భద్రాచలం శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమవుతోంది. ఏప్రిల్ 10న స్వామివారి కళ్యాణం, 11న శ్రీరామ పట్టాభిషేకాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణ తలంబ్రాలు కలిపే వేడుక మరియు వసంతోత్సవం, డోలోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం భద్రాద్రి రాముడు పెళ్లి కొడుకుగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆ తర్వాత సాంప్రదాయబద్ధంగా ముత్యాల తలంబ్రాలను కలిపారు. దాదాపు 2 టన్నుల ముత్యాల తలంబ్రాలను భక్తులు తమ చేతులతో కలిపారు. రాములవారి కల్యాణానికి సుమారు 15 టన్నుల తలంబ్రాలను తయారు చేస్తున్నారు. ఈ వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను తిలకించారు.

దక్షిణ భారత అయోధ్యగా విరాజిల్లుతున్న భద్రాచల క్షేత్రంలో ప్రతి ఏటా అంగరంగ వైభవంగా శ్రీ సీతారామచంద్ర స్వామివార్ల కల్యాణం నిర్వహిస్తున్నారు. అయితే రెండేళ్లుగా కోవిడ్ కారణంగా కేవలం కొద్ది మంది అర్చకుల సమక్షంలో ఏకాంతంగానే రామయ్య కళ్యాణం నిర్వహించారు. భక్తులకు ఈ వేడుక ప్రత్యక్షంగా చూసే భాగ్యం లేకపోయింది. ఈసారి కోవిడ్ ఎఫెక్ట్ తగ్గడంతో స్వామివారి కళ్యాణం, శ్రీరామ పట్టాభిషేకాన్ని భక్తుల సమక్షంలో మిథిలా ప్రాంగణంలో నిర్వహించాలని నిర్ణయించి అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేస్తున్నారు.

స్వామివారి కళ్యాణోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు కోటి 10 లక్షలకు పైగా వ్యయంతో దేవస్థానం పనులను చేపట్టింది. ఇప్పటికే దీనికి సంబంధించి ఆన్‌లైన్‌లో టిక్కెట్ల విక్రయాన్ని కూడా ప్రారంభించారు. అయితే ఏర్పాట్లపై ఇవాళ కీలక సమీక్ష జరపనున్నారు జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్. తిరిగి ఈ నెల 21న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ బ్రహ్మోత్సవాలపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. 

Tags:    

Similar News