Bathukamma Festival 2021: తెలంగాణలో మొదలైన బతుకమ్మ పండుగ సంబరాలు
Bathukamma Festival 2021: తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ...
Bathukamma Festival 2021: నేటి నుంచి బతుకమ్మ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభమై.. సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. గత రెండేళ్ల నుంచి జరుపుకోలేకపోయామని.. ఈ ఏడాది జరుపుకోవాలని ఉదయాన్నే అన్ని ఏర్పాట్లు చేసుకొని బతుకమ్మ జరుపుకుంటున్నామంటున్నారు.
సూర్యాపేట జిల్లా కేంద్రంలో బతుకమ్మ సంబరాలు మొదలయ్యాయి. రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి క్యాంప్ ఆఫీస్‌లో జగదీష్ రెడ్డి దంపతులు తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చారు. కార్యక్రమంలో జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ గుజ్జ దీపికా యుగంధర్ రావు, మున్సిపల్ చైర్మన్ పెరుమాండ్ల అన్నపూర్ణమ్మ తదితరులు పాల్గొన్నారు. ఇక ఈ సాయంత్రం సూర్యపేట పట్టణంలో బతుకమ్మ ఆటకు సద్దుల చెరువు సర్వాంగ సుందరంగా ముస్తాబౌతుంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టి పడేలా జరుగుతున్న ఏర్పాట్లను మంత్రి జగదీష్ రెడ్డి పరిశీలించారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తెలంగాణ మహిళలు సంబరంగా జరుపుకునే పూల జాతర మొదలయ్యింది. తంగేడు పూల ముచ్చట్లు... గునుగు పూల సంబరాల మధ్య.. ఎంగిలి పూల బతుకమ్మతో వేడుకలు ప్రారంభమయ్యాయి. చిన్న బతుకమ్మలతో మొదలై... నవమి రోజున సద్దుల బతుకమ్మతో వేడుకలు ముగియనున్నాయి. సంవత్సరం పొడవునా ఎన్ని పండగలు వచ్చినా... బతుకమ్మ పండుగ ప్రత్యేకత వేరుగా ఉంటుందని మహిళలు చెబుతున్నారు. తంగేడు గునుగు పూల సేకరణకు పల్లెల్లో మహిళలు ఉత్సాహంగా కదిలారు. బతుకమ్మ ఆట పాటలతో పూలను సేకరించారు. పూల జాతరను అట్టహాసంగా నిర్వహించేందుకు రెడీ అయ్యారు.
హన్మకొండ చౌరస్తాలో బతుకమ్మ పూల సందడి మొదలయ్యింది. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ. ఎంగిలి పూలతో బతుకమ్మ పండుగ మొదలవుతుంది. తొమ్మిది రోజుల పాటు ఎంతో ఘనంగా పువ్వులను పూజించుకుంటూ బతకమ్మ పండగ జరుపుకుంటారు తెలంగాణ ఆడపడుచులు.