Money Laundering In Hyderabad : హవాలా డబ్బును రాష్ట్రాలు దాటించడానికి కొంత మంది ప్రయత్నం చేస్తుంటే వాళ్లని పోలీసులు రెడ్ హ్యండెడ్ గా పట్టుకోవడం లాంటి సన్నివేశాలు మనం సినిమాల్లో చాలానే చూసుంటాం. కానీ ఇప్పుడు హైదరాబాద్ పోలీసులు దాన్ని నిజం చేసి చూపించారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 3కోట్లకు పైగా హవాలా సొమ్మును దాటిస్తున్న ఓ ముఠాను పోలీసులు చాకచక్యంగా పట్టుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు. అసలు ఈ సంఘటను హైదరాబాద్ కమిషనర్ అంజనీ కుమార్ తెలిపిన పూర్తివివరాల్లోకెళితే బంజారాహిల్స్‌లో మంగళవారం టాస్క్ ఫోర్స్ పోలీసులు 3 కోట్ల 75 లక్షల హవాలా డబ్బును పట్టుకున్నారు. నగరంలోని దొరికిన ఈ సొమ్మును పశ్చిమ మండల పోలీసులు సీజ్ చేశారు. నలుగురు వ్యక్తులు వెస్ట్‌జోన్‌లోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లో ఓ కారులో డబ్బులను తరలిస్తుండగా పట్టుకున్నామని హైదరాబాద్ కమిషనర్ అంజనీ కుమార్ మీడియాకు తెలిపారు. డబ్బును తరలిస్తున్న నలుగురు నిందితులను పట్టుకుని అదుపులోకి తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. నిందితులను ఈశ్వర్ దిలీప్ జీ, హరీష్ రామ్ బాయ్, అజిత్ సింగ్, రాథోడ్ గా గుర్తించామని ఆయన వెల్లడించారు.
అసలు ఈ డబ్బు ఎక్కడి నుంచి తీసుకువస్తున్నారు, ఎంత మంది చేతులు మారిందన్న అంశంపై ఐటీ శాఖ అధికారులు దర్యాప్తు చేస్తారని సీపీ చెప్పారు. అదే విధంగా ఈ హవాలా డబ్బును ఎక్కడ ఇవ్వాలని అనుకుంటున్నారు అనేది విషయాలపై కూడా అధికారులు దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. ఈ హవాలా డబ్బుతో పాటు నిందితులను ఆదాయపన్ను శాఖకు అప్పగిస్తున్నామన్నారు. ఆదాయపు పన్ను అధికారుల విచారణలో ఈ కేసుకు సంబంధించిన మరిన్నికొన్ని నిజాలు బయట పడే అవకాశం ఉందని సీపీ తెలిపారు. ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న హైదరాబాద్ వెస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులను అంజనీ కుమార్ అభినందించారు.