మేడ్చల్ జిల్లాలో దారుణం
* విద్యార్థినిని కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన ఆటో డ్రైవర్ * విద్యార్థిని కాలేజీ నుంచి ఇంటికెళ్తుండగా ఘటన * జోడిమెట్ల వద్ద చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం
మళ్లీ అదే తీరు ఎన్ని సార్లు హెచ్చరించినా మారడం లేదు. అమ్మాయి కనిపిస్తే చాలు మృగాళ్లు కామంతో చెలరేగిపోతున్నారు. బరి తెగిస్తున్నారు. చట్టాలు ఉన్నాయని శిక్షలు పడుతున్నాయని భయపడడం లేదు. తమలోని నరరూప రాక్షసుడిని బయటకు తెస్తున్నారు. బయటకు వెళ్లిన మహిళ ఇంటికి తిరిగి వచ్చే వరకు రక్షణ లేకుండా పోతుంది. నిత్యం ఏదో ఒక చోట అమ్మాయిలపై వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. మొన్న దిశ ఘటన మరవక ముందే.. హైదరాబాద్ శివారులో మరో ఘటన జరిగింది. హైదరాబాద్‌కు కూతవేటు దూరంలో కాలేజీకి వెళ్లి వస్తున్న ఒక విద్యార్ధిని మానవ రూపంలో ఉన్న మృగాళ్లు కాటేశాయి.
హైదరాబాద్ ఘట్కేసర్ పరిధిలో ఇంజనీరింగ్ విద్యార్థినిపై ఆటో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. కాలేజ్ నుంచి విద్యార్థిని ఇంటికి వెళుతుండగా ఆటో డ్రైవర్ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. జోడిమెట్ల పొదల్లోకి లాక్కెళ్లి అత్యాచారం చేసిన కిరాతకుడు యువతిని బట్టలు లేకుండా రోడ్డుపైనే యువతిని వదిలి వెళ్లాడు. సమాచారం అందుకున్న ఘట్‌కేసర్ పోలీసులు యువతిని మేడిపల్లి క్యూర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితురాలి స్టేట్‌మెంట్ రికార్డ్ చేశారు.
ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. బాధితురాలి స్టేట్‌మెంట్ ప్రకారం ఆటోడ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.. మల్కాజ్‌గిరి డీసీపీ రక్షితమూర్తి రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తున్నారు. ఆటోలో నలుగురు నిందితులు ఉన్నట్టు ప్రాథమికంగా గుర్తించినట్టు తెలిపారు. విద్యార్థిపై అత్యాచారం జరిగిందా లేదా అనేది వైద్యులు నిర్దారించాలన్నారు. నిందితులను గుర్తించేందుకు 10 బృందాలు ఏర్పాటు చేశామన్నారు. వీలైనంత త్వరలో నిందితులను పట్టుకుంటామన్నారు.
ప్రస్తుతం విద్యార్ధిని పరిస్థితి క్రిటికల్‌గానే ఉందని.. ఆమె మాట్లాడే పరిస్థితిలో లేదని డీసీపీ రక్షిత మూర్తి పేర్కొన్నారు. తల్లిదండ్రులు 100కి కాల్ చేయడంతో ఘట్ కేసర్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని బాధితురాలిని ఆస్పత్రికి చేర్చారని తెలిపారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామన్నారు.
పోలీస్ వాహనం సైరన్ వినగానే యువతిని ఘటన స్థలంలోనే దుండగులు పారిపోయారు. అయితే అంతకుముందు బాధితురాలు ఆపదలో ఉన్నానంటూ తల్లిదండ్రులకు ఫోన్ చేసింది. వాళ్లు డయల్ 100కి కాల్ చేశారు. యువతి ఫోన్ కాల్ లిస్ట్, నెట్‌వర్క్ ఆధారంగా లొకేషన్ ట్రేస్ చేస్తున్నారు.