2000 Notes: ఎన్నికల వేళ రాష్ట్రంలో రూ. 2 వేల నోట్లు లేని లోటు
2000 Notes: రూ. 2 వేల నోట్లు లేకపోవడంతో నాయకుల ఇబ్బందులు
2000 Notes : రెండు వేల రూపాయిల నోటు.. లేని లోటు.. ఈ ఎన్నికల్లో ప్రత్యక్ష ప్రభావాన్ని చూపిస్తోంది. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఇది పెద్ద సమస్యగా మారింది. గతంలో రెండు వేల నోట్లు తరలించేందుకు.. పంచేందుకు సులభంగా ఉండేది. ఇప్పుడు ఆ నోట్లు లేకపోవడంతో.. ఈ ఎన్నికల్లో ప్రచార ఖర్చులకు.. పోలింగ్‌కు ఒక రోజు ముందే ఓటర్లకు పంచేందుకు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు నేతలు. పోలింగ్ తేదీ దగ్గరపడుతుండటంతో.. డబ్బులు సమకూర్చుకోలేక బడా లీడర్ల నుంచి.. చోటా లీడర్ల వరకూ రాజకీయ నేతలందరూ సతమతమవుతున్నారు.
సాధారణంగా ఒక రెండు వేల నోట్లు.. నాలుగు 500 నోట్లకు సమానం.. రెండు వేల నోట్ల కట్ట అయితే.. 2 లక్షలు.. చిన్న బ్యాగులోనూ... 5 కట్టలు పట్టినా.. 10 లక్షలు తీసుకెళ్లొచ్చు. కానీ.. ఇప్పుడు 500 నోట్లతో అదే 10 లక్షలు తరలించాలంటే.. 20 కట్టలు కావాలి. బ్యాగులో తరలించాలన్నా.. చాలా ఇబ్బంది. దీనికి తోడు.. అడుగడుగునా.. పోలీసులు తనిఖీలు చేస్తుండటంతో.. ఇది మరింత సమస్యగా మారింది.
ఒక ఇంట్లో నాలుగు ఓట్లు ఉంటే.. ఏ అర్ధరాత్రో.. వెళ్లి ఓ రెండు వేల రూపాయల నోటు ఇచ్చేవారు..పోటీ ఎక్కువగా ఉన్న ప్రాంతంలో రెండు నోట్లు ఇచ్చేవారు. ఈ లెక్కన ఇప్పుడు ఆ నాలుగు ఓట్ల కోసం 8 నోట్లు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఎక్కువ మొత్తంలో 500 నోట్లు అవసరం ఏర్పడింది. ఇదే ఇప్పుడు నేతలకు తలనొప్పిగా మారింది. ఎక్కడెక్కడినుంచో డబ్బులు సమకూర్చుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అయితే.. ఓటర్లకు పంపిణీ సమస్యకంటే.. తరలించుకోవడమే ప్రధాన సమస్యగా మారిందని.. నేతలు తలలు పట్టుకుంటున్నారు.