కరోనా చికిత్స పొందిన పేదలకు సీఎంఆర్‌ఎఫ్‌ కింద సాయం

Update: 2020-09-10 04:50 GMT

కరోనా చికిత్స పొందిన పేదలకు సీఎంఆర్‌ఎఫ్‌ కింద సాయం చేస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. బుధవారం కరోనాపై అసెంబ్లీలో జరిగిన స్వల్పకాలిక చర్చలో సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ కరోనాను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చే విషయాన్ని పరిశీలిస్తున్నామని ప్రకటించారు. ఈ విషయంపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఇప్పటి వరకు కరోనా చికిత్స పొందిన పేదలు వాటికి సంబంధించిన బిల్లులుంటే తనకు పంపాలని కోరారు. బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో తీసుకొచ్చిన ఆయుష్మాన్‌ భారత్‌ కంటే మన ఆరోగ్యశ్రీ ఎన్నో రెట్లు పటిష్టంగా ఉందని చెప్పారు. రాష్ట్ర గవర్నర్‌కు కూడా ఆయుష్మాన్‌ భారత్‌తో కలిపి ఆరోగ్యశ్రీని నడిపిస్తామని చెప్పామన్నారు. కార్పొరేట్‌ ఆసుపత్రులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాయి. కరోనాతో చనిపోయినా, ఆ శవాలు ఇవ్వడానికి కూడా డబ్బులు అడుగుతూ పీడించడం సమంజసం కాదు. ఆరోగ్యశ్రీని, 108ని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి తీసుకొచ్చారన్నారు. ఆ పథకాలు ఎంతో బాగున్నాయని అందువల్లే తాము వాటి పేరును కూడా మార్చకుండా అలాగే కొనసాగిస్తున్నామని స్పష్టంచేశారు. అన్ని రకాల మందులు నూటికి నూరు శాతం ఉన్నాయి. నేను గాంధీ ఆసుపత్రికి వెళ్లలేదంటున్నారు. కానీ రేయింబవళ్లు దీనికోసం పని చేశాను. లక్ష మందికి చికిత్స చేసేలా సిద్ధం చేశాం.

ప్రైవేట్‌ ఆసుపత్రులు లూటీ చేస్తాయని మొదట్లోనే చెప్పాను. ఐసీఎంఆర్‌ 15 ఆసుపత్రులకు మాత్రమే అనుమతినిచ్చింది. లూఠీ చేసే ఏ ఆసుపత్రిపైనైనా కఠిన చర్యలు తీసుకుంటాం. తీసుకున్న చర్యలపై వారానికోసారి బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎంలకు నివేదిక పంపిస్తాం. సీనియర్‌ ఐఏఎస్‌లతో కమిటీ వేస్తాం. కరోనా అడ్డుకునే విషయంలో రూ.వేల కోట్లు ఖర్చు చేశాం. ప్రజా ప్రతినిధులు, ఉద్యోగుల జీతాలు 60 శాతం ఆపేసి చేశాం. ఆర్థిక శాఖలో మూడు, నాలుగు కోట్లు కరోనా కోసం రిజర్వులో పెట్టాం. 20 వేల బెడ్లు ఒకేసారి అందుబాటులో ఉంచేలా చేశాం. ప్రజల్లో భరోసా నింపుదాం. ఈటల రాజేందర్‌ను అందరూ మెచ్చుకున్నారు. ఆయన పనితీరు ప్రశంసనీయమైంది. ఆయనకు రిలీఫ్‌ ఇచ్చేందుకు రెండ్రోజులు నియోజకవర్గానికి వెళ్లమని సూచించాను. ఉత్పాతం వస్తే ఏం చేస్తాం? బెంబేలెత్తిస్తామా? భరోసా కల్పిస్తామా? మేం ప్రజల పట్ల బాధ్యతాయుతంగా ఉన్నాం. వారిలో భయాందోళన లు కలిగించకూడదు.

Tags:    

Similar News