Lands Issue: హాట్‌టాపిక్‌గా మారిన తెలంగాణలో పోడు భూముల వివాదం

Lands Issue in Telangana: భద్రాచలం ఏజెన్సీలోని ప్రతీ మండలంలో అడవుల నరికివేత యధేచ్చగా కొనసాగుతుంది.

Update: 2021-06-25 06:54 GMT

పోడు భూములు (ఫైల్ ఇమేజ్)

Lands Issue in Telangana: పోడు భూముల వివాదం తెలంగాణలో హాట్‌టాపిక్‌గా మారింది. తొలకరి వర్షాలు ప్రారంభం కాగానే ఏజెన్సీ ప్రాంతంలో ఘర్షణ వాతావరణం నెలకొంటుంది. తరిగిపోయిన అడవులకు పునరిజ్జీవం ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం భగీరథయత్నం చేస్తుంది. అడవి బిడ్డలు మాత్రం పోడు భూములు తమవే అంటుండంతో వివాదం నెలకొంటుంది.

భద్రాచలం ఏజెన్సీలోని ప్రతీ మండలంలో అడవుల నరికివేత యధేచ్చగా కొనసాగుతుంది. అడవులను పరిరక్షించాల్సిన అటవీశాఖ అధికారులు.. అడకత్తెరలో పోక చెక్కలా నలిగిపోతున్నారు. తెలంగాణ ప్రభుత్వం అడవుల రక్షణ కోసం ప్రత్యేక శ్రద్ద తీసుకోవడంతో పోడు భూముల నియంత్రణకు అధికారులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. అడవినే నమ్ముకున్న గిరిజనులు పోడు భూముల హక్కుల కోసం పోరాటం చేసేందుకు సిద్దం అవుతున్నారు.

ఏజెన్సీలో పోడు వివాదం నివురుగప్పిన నిప్పులా కొనసాగుతుంది. భద్రాచలం ఏజెన్సీలో వేల ఎకరాల అడవులు సాగు భూములుగా మారాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అటవీ విస్థీర్ణంలో రెండు లక్షల ఎకరాల భూమిలో అన్యాక్రాంతం అయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇల్లందు, పినపాక, అశ్వారావుపేట, భద్రాచలం నియోజకవర్గాలలో పోడు సమస్య తీవ్రంగా ఉంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గిరిజనేతరుల కన్ను పోడు భూములపై పడటంతో అడవుల విస్థీర్ణం హారతి కర్పూరంలా తరిగిపోతుంది. ఛత్తీస్‌గఢ్‌ నుంచి వచ్చిన గొత్తికోయలు, స్థానిక గిరిజనులు ఎవరికి వారు అడవులపై పడటంతో పోడును అడ్డుకునే నాధులు కరువయ్యారు.

గిరిజనుల అమాయకత్వాన్ని కొందరు గిరిజనేతరులు తమకు అనుకూలంగా మల్చుకున్నారు. పోడు భూముల వివాదంలోకి గిరిజనుల వెనక ఉండి గిరిజనేతరులు చక్రం తిప్పుతున్నారని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

పైడిగూడెం పరిధిలో అటవీశాఖ అధికారుల రికార్డ్‌ ప్రకారం సుమారు 1970 ఎకరాలు అటవీ భూమి ఉందని.. అందులో గిరిజలకు అవసరం మేర పట్టా భూమి ఉందంటున్నారు అధికారులు. మిగిలిన 1700 ఎకరాల భూములను ఆక్రమించుకుంటున్నారని చెబుతున్నారు. వారిని ఎన్నిసార్లు పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చిన మారడం లేదంటున్నారు.

రాష్ట్రంలో పోడు సమస్య పరిష్కారం కోసం ఎప్పుడైతే ప్రభుత్వం పోడు పట్టాలు ఇచ్చిందో అప్పటి నుంచి వేల ఎకరాలలో అడవుల నరికివేత కొనసాగింది. గతంలో కన్నా రెండింతల అడవులు అంతరించిపోయాయి. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు అటవీశాఖ అధికారులకు ఖంగు తినిపిస్తున్నాయి. అటవీశాఖ అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తం అవుతున్నా... అడవుల నరికివేత ఆపలేకపోతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 10 లక్షల ఎకరాల అటవీ విస్థీర్ణం ఉండగా.. 20 శాతానికి పైగా అడవులు పోడు వ్యవసాయంగా మారటం అధికారులకు ఆందోళనకు గురిచేస్తుంది.

Tags:    

Similar News