Ashada Masam Bonalu: నేటి నుంచి ఆషాఢ మాసం బోనాలు షురూ
Ashada Masam Bonalu: గోల్కొండ అమ్మవారి తొట్టెల ఊరేగింపుతో బోనాల సందడి మొదలు కానుంది.
Ashada Masam Bonalu: ఆషాడమాసం బోనాల ఉత్సవాలకు భాగ్యనగరం సిద్ధమైంది. గోల్కొండ జగదాంబికా అమ్మవారికి బోనం సమర్పించడంతో ఉత్సవాలు మొదలుకానున్నాయి. గోల్కొండ అమ్మవారి తొట్టెల ఊరేగింపుతో బోనాల సందడి మొదలు కానుంది. ఇవాళ్టి నుంచి దాదాపు నెల రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి.
ఇప్పటికే బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం భావించిన దరిమిలా.. అధికారులు సైతం ఆ మేరకు ఏర్పాట్లు చేశారు. ఉత్సవాల్లో భాగంగా లంగర్‌హౌస్ నుంచి తొట్టెల ఊరేగింపు జరగనుంది. బగ్గీపై ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పణ సమర్పిస్తారు. అమ్మవారికి పట్టువస్త్రాలను మంత్రులు ఇంద్రకరణ్, తలసాని శ్రీనివాస్ సమర్పించనున్నారు. 25, 26 తేదీల్లో సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళీ అమ్మవారి బోనాలు, ఆగస్టు 1,2 తేదీల్లో ఓల్డ్‌సిటీ లాల్ దర్వాజా మహంకాళీ అమ్మవారి బోనాలు జరగనున్నాయి.. ఆగస్ట్ 8న గోల్కొండలోనే ఉత్సవాలు ముగియనున్నాయి.
తెలంగాణ ప్రజలకు బోనాల పండుగ ప్రారంభం సందర్భంగా సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. బోనాల ఉత్సవాలు తెలంగాణ సబ్బండ వర్ణాల గంగా జమునా తెహజీబ్ కు ప్రతీక గా నిలుస్తాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అమ్మవారి దీవెనతో, ప్రభుత్వ పట్టుదలతో.. తెలంగాణ రాష్ట్రం దేశానికే భోజనం పెట్టే అన్నపూర్ణగా మారిందన్నారు. తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో సుభిక్షంగా జీవించేలా అమ్మవారి ఆశీస్సులు కలకాలం కొనసాగాలని సీఎం కేసీఆర్ ప్రార్థించారు.