ఆన్‌లైన్ క్యాష్ యాప్ నిర్వాహకుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. సిద్దిపేట, హైదరాబాద్ ఘటనలు మరువకముందే మరో ఉదంతం వెలుగుచూసింది. మేడ్చల్ జిల్లా కొంపల్లికి చెందిన శ్రీకాంత్ గో-క్యాష్ యాప్ ద్వారా 50 వేలు రుణం కోరాడు. అయితే అన్ని ఛార్జీలు తీసుకొని 35వేల రూపాయలు మాత్రమే శ్రీకాంత్ అకౌంట్‌లో జమ చేసింది యాప్ యాజమాన్యం. ఒక వారం గడువులోపు డబ్బు చెల్లించాలని సూచించింది.
కొన్ని అనివార్య కారణాలతో శ్రీకాంత్ గడువులోపు డబ్బు చెల్లించలేదు. దీంతో శ్రీకాంత్‌కు ఫోన్ చేసిన యాప్ నిర్వాహకులు వేధింపులకు గురిచేశారు. శ్రీకాంత్ డబ్బు చెల్లించేందుకు మరికొంత గడువు కోరగా దానికి ససేమిరా అంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. తన బంధువులు, స్నేహితులకు ఫ్రాడ్ అంటూ మెసేజ్‌లు పంపుతామని కేసులు పెడతామని బెదిరించారు. దీంతో బాధితుడు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా పోలీసులు అతడి ఫిర్యాదును స్వీకరించలేదు. దీంతో బాధితుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.