Telangana: తెలంగాణ రాష్ట్రానికి అమూల్
Telangana: హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్‌తో సమావేశమైన అమూల్ ప్రతినిధులు
Telangana: పాడి ఉత్పత్తుల సంస్థ అమూల్ తెలంగాణలో రూ. 500 కోట్లతో భారీ డెయిరీ ప్లాంటు ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు సమక్షంలో అమూల్ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. రోజుకు అయిదు లక్షల లీటర్ల పాల ఉత్పత్తుల సామర్థ్యంతో స్థాపించి, భవిష్యత్తులో దీన్ని పది లక్షల లీటర్లకు పెంచనుంది.
18 నుంచి 24 నెలల్లో నిర్మాణం పూర్తి చేసి కార్యకలాపాలను ప్రారంభించేందుకు కసరత్తులు మొదలుపెట్టారు.సిద్దిపేట జిల్లా వర్గల్ వద్ద 50 ఎకరాల్లో ఏర్పాటుచేయనున్న ఈ ప్లాంటు ద్వారా 500 మందికి పైగా ప్రత్యక్షంగా, మరో రెండువేల మందికి పరోక్షంగా ఉపాధి లభించనుంది. బ్రెడ్, బిస్కెట్, స్నాక్స్, సాంప్రదాయిక మిఠాయిలు తదితర ఉత్పత్తుల డివిజన్‌ను సైతం ఏర్పాటు చేయనుంది.
ఇందుకు అవసరమైన పాలను తెలంగాణ రైతులు, సమాఖ్యలు, సహకార సంఘాల నుంచి సేకరిస్తామని తెలిపింది.ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అమూల్ సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు. పాల రంగంలో విప్లవం సృష్టించి ప్రపంచానికి గొప్ప పాఠాలు నేర్పిన సంస్థ తెలంగాణలో అడుగుపెట్టడం రాష్ట్రానికి గర్వకారణమన్నారు. ఆహారశుద్ధి పరిశ్రమల కేటగిరిలో మెగా పరిశ్రమ హోదా కల్పించి, భూకేటాయింపులతో పాటు భారీగా రాయితీలు, ప్రోత్సాహకాలు కల్పిస్తామన్నారు మంత్రి కేటీఆర్.