పరేడ్ గ్రౌండ్‌లో అమిత్ షా.. ఎన్టీఆర్ స్టేడియం వద్ద కేసీఆర్..!
*సెప్టెంబర్ 17న ఏం జరగబోతోంది..?
Telangana Liberation Day: హైదరాబాద్ నగరంలో రాజకీయ వేడి మొదలైంది. సెప్టెంబర్ 17 తేదన ఏం జరగబోబోందోననే ఉత్కంఠ నెలకొంది. అదే రోజు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేర్వేరు కార్యక్రమాలు నిర్వహిస్తుండగా.. అధికార, ప్రతిపక్ష నాయకులు, అగ్రనేతలు ఈ కార్యక్రమాన్ని ప్రతిష్ఠా్త్మకంగా తీసుకున్నాయి.
తెలంగాణ సమాజం రాచరికం నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి ప్రవేశించి 75వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా.. 17న తెలంగాణ జాతీయ సమైక్యత దినంగా పాటించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. 16, 17, 18 తేదీల్లో తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల ప్రారంభ కార్యక్రమాలను.. 2023 సెప్టెంబరు 16, 17, 18 తేదీల్లో ముగింపు ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని భావించారు. ఈ నెల 17న సీఎం కేసీఆర్ హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రసంగించనున్నారు. అదే రోజు రాష్ట్రవ్యాప్తంగా కూడా కార్యక్రమాలు జరగనున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సంగతి అలా ఉంటే.. విమోచన దినోత్సవం పేరుతో.. కేంద్ర ప్రభుత్వం పరేడ్ గ్రౌండ్‌లో కార్యక్రమాలు నిర్వహిస్తోంది. దీనికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా రావడం మరింత హాట్ టాపిక్‌గా మారింది. కేంద్ర ప్రభుత్వం తరఫున జరిగే వేడుకల్లో భాగంగా.. అసెంబ్లీ ఎదురుగా ఉన్న సర్దార్ పటేల్ విగ్రహానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా పూలమాల వేసి నివాళులర్పించనున్నారు. ఆ తర్వాత పరేడ్ గ్రౌండ్స్‌లో కేంద్ర పారామిలిటరీ బలగాల కవాతులో గౌరవ వందనం స్వీకరించనున్నారు. సెప్టెంబరు 17కు ఉన్న ప్రాధాన్యంపై అమిత్ షా ప్రసంగించనున్నారు.
అయితే.. సెప్టెంబర్ 17 గురించి సీఎం కేసీఆర్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేయబోయే ప్రసంగాలపైనే అందరు దృష్టి పెట్టారు. ఆ ఇద్దరు నేతలు ఏం మాట్లాడబోతున్నారు.. ఎలాంటి సందేశ ఇవ్వబోతున్నారనే చర్చ తెలంగాణలో జరుగుతోంది. మొత్తానికి ఈ రెండు కార్యక్రమాలతో ఉత్కంఠ నెలకొంది.