Ambulance Breakdown In Forest: అర్ధరాత్రి అరణ్య రోదన..నాలుగు గంటలు నరకయాతన

Ambulance Breakdown In Forest: కరోనా మహమ్మారి బారిన పడి ఓ వ్యక్తి తన ప్రాణాలను కోల్పోయాడు. ఆ విషయం తెలియగానే అతని భార్య, తల్లి మృతదేహాన్ని అంబులెన్స్‌లో ఎక్కించి సొంతూరుకు ప్రయాణం అయ్యారు.

Update: 2020-08-05 07:42 GMT

Ambulance Breakdown In Forest: కరోనా మహమ్మారి బారిన పడి ఓ వ్యక్తి తన ప్రాణాలను కోల్పోయాడు. ఆ విషయం తెలియగానే అతని భార్య, తల్లి మృతదేహాన్ని అంబులెన్స్‌లో ఎక్కించి సొంతూరుకు ప్రయాణం అయ్యారు. అలా కొంత దూరం ప్రయాణం చేసిన తరువాత అర్థరాత్రి వేళ మృతదేహాన్ని తరలించే అంబులెన్స్ అడవి మధ్యలో ఆగిపోయింది. సరిగ్గా అదే సమయానికి జోరున వర్షం పడటం మొదలైంది. చూట్టూ చీకటి, దట్టమైన అడవి, బయట వర్షం ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఆ ఇద్దరు మహిళలు బిక్కు బిక్కు మంటూ డెడ్ బాడీతోపాటు గంటల తరబడి అంబులెన్స్‌లోని ఉండిపోవాల్సి వచ్చింది. ఈ హృదయవిదారక సంఘటన భద్రాచలం ఏజెన్సీలో చోటు చేసుకుంది.

ఈ సంఘటనకు సంబంధించి పూర్తివివరాల్లోకి వెళ్తే.. భద్రాద్రి జిల్లా కరకగూడెం మండలం అనంతారానికి చెందిన ఓ వ్యక్తి మణుగూరులో ఓ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. కాగా అతను కొద్ది రోజుల క్రితం జ్వరం బారిన పడ్డాడు. దాంతో అతని కుటుంబ సభ్యులు భద్రాచలం ఏరియా హాస్పిటల్‌లో చేర్పించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నప్పటికీ జ్వరం తక్కువ కాకపోవడంతో అక్కడి వైద్యులు అతనికి కరోనా సోకిందనే అనుమానంతో టెస్టులు చేసారు. ఆ టెస్టుల్లో కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో అతనికి వైద్యుతు కరోనా చికిత్స చేయడం ప్రారంభించారు. అయినా ఫలితం దక్కలేదు సోమవారం సాయంత్రం అతడు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.

అనంతరం కరోనా నిబంధనల మేరకు మృతదేహాన్ని సొంతూరు తీసుకెళ్లడానికి అంబులెన్స్‌లోకి ఎక్కించారు. అలా కొంత దూరం ప్రయాణం చేసిన తరువాత మణుగూరు క్రాస్ రోడ్ దాటిన కొద్ది సేపటికే అటవీ ప్రాంతంలో అంబులెన్స్ ఆగిపోయింది. అదే సమయంలో భారీగా వర్షం కురిసింది. డ్రైవర్ ఎంత ప్రయత్నించినా వాహనం మొరాయించిందే కానీ ముందుకు కదల్లేదు. అడవిలో చిక్కుకుపోయామని ఏదైనా వాహనం సమకూర్చాలని మృతుడి భార్య, తల్లి తెలిసిన వారికల్లా ఫోన్లు చేశారు. కానీ ఆ వ్యక్తి కరోనా వైరస్ బారిన పడి చనిపోవడంతో బంధువులు కూడా ఎవరూ ముందుకు రాలేదు. కొన్ని గంటల పాటు ఇదే పరిస్థితి కొనసాగింది. చివరకు బూర్గంపహడ్‌కు చెందిన నాని అనే యువకుడు మృతదేహాన్ని తరలించేందుకు వాహనాన్ని సమకూర్చాడు. ఆ వాహనం అక్కడికి చేరుకున్న తరువాత మృతుడి తల్లి, భార్యే మృతదేహాన్ని బాడీని అంబులెన్స్ నుంచి మరో వాహనంలోకి మార్చి సొంతూరు తీసుకెళ్లారు. తెల్లవారే లోపే వర్షం కురుస్తున్నప్పటికీ మృతదేహాన్ని ఖననం చేశారు.

Tags:    

Similar News