Allu Arjun Arrest: రేవంత్ సహా ఎవరేవరు ఏమన్నారంటే?
చట్టం ముందు అందరూ సమానమేనని తెలంగాణ సీఎం ఎ.రేవంత్ రెడ్డి చెప్పారు. అల్లు అర్జున్ అరెస్టుపై శుక్రవారం మధ్యాహ్నం దిల్లీలో ఆయన స్పందించారు
చట్టం ముందు అందరూ సమానమేనని తెలంగాణ సీఎం ఎ.రేవంత్ రెడ్డి చెప్పారు. అల్లు అర్జున్ అరెస్టుపై శుక్రవారం మధ్యాహ్నం దిల్లీలో ఆయన స్పందించారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు.ఇందులో తన జోక్యం ఏమీ ఉండదని ఆయన చెప్పారు. సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాటలో ఒకరు చనిపోవడంతోనే పోలీసులు అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారని ఆయన అన్నారు.
అల్లు అర్జున్ అరెస్టు తీరు సరికాదు: కేంద్ర మంత్రి బండి సంజయ్
అల్లు అర్జున్ అరెస్ట్ తీరు సరిగా లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు.అల్లు అర్జున్ అరెస్టుపై ఆయన స్పందించారు.నేరుగా బెడ్ రూమ్ కు వచ్చి అరెస్ట్ చేస్తారా అని ఆయన ప్రశ్నించారు.అల్లు అర్జున్ ఇండియన్ సినిమాకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చారని ఆయన గుర్తు చేశారు. అలాంటి నటుడికి గౌరవం ఇవ్వాలి.. నేరస్తుడిగా చూడొద్దని బండి సంజయ్ చెప్పారు.తొక్కిసలాటను ప్రభుత్వ వైఫల్యమే కారణమని ఆయన అన్నారు.
అల్లు అర్జున్ అరెస్ట్ సరైన విధానం కాదు: కేటీఆర్
అల్లు అర్జున్ అరెస్ట్ చేయడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ తప్పుబట్టారు. పాలకుల అభద్రతా కారణంగానే అల్లు అరెస్ట్ జరిగిందని ఆయన ఆరోపించారు. జాతీయ అవార్డు విన్నర్ అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడం సరైన విధానం కాదని ఆయన ట్వీట్ చేశారు. సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో మరణించిన కుటుంబం పట్ల తనకు సానుభూతి ఉందన్నారు.
అల్లు అర్జున్ అరెస్ట్ ను ఖండిస్తున్నట్టు చెప్పారు. అల్లు అర్జున్ పట్ల ఇలా వ్యవహరించడం సరైంది కాదన్నారు. హైడ్రా కూల్చివేతల కారణంగా ఇద్దరు మరణించారని, ఈ కేసులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయాలని ఆయన ట్వీట్ చేశారు.ఇదే విషయమై నెటిజెన్స్ స్పందిస్తున్నారు. తొక్కిసలాట ఘటనలో మహిళ చనిపోయినప్పుడు బాధితుల పక్షాన నిలవలేదు కానీ అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేయగానే కేటీఆర్ ఎందుకంత ఫీలవుతున్నారని నెటిజెన్స్ ప్రశ్నిస్తున్నారు.
అసలు బెనిఫిట్ షో లకు ఎవరు అనుమతిచ్చారు?: హరీష్ రావు
అసలు బెనిఫిట్ షోలకు ఎవరు అనుమతించారని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు.ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా సినిమా ప్రదర్శించింది ఎవరని ఆయన అడిగారు.
తొక్కిసలాటలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు.ఇందుకు రాష్ట్ర పాలకులే కారణమన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపైనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
అల్లు అర్జున్ అరెస్ట్ ను ఖండించిన రాజాసింగ్
సంధ్య థియేటర్ తొక్కిసలాటకు అల్లు అర్జున్ బాధ్యుడు కాదని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు.జాతీయ అవార్డు సాధించి అల్లు అర్జున్ మన ప్రతిష్ఠ పెంచారని ఆయన అన్నారు. అలాంటి నటుడిని నేరస్తుడిగా చూడడం సరికాదన్నారు.
అల్లు అర్జున్ ను ఖండించిన జగన్
అల్లు అర్జున్ అరెస్ట్ ను ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఖండించారు. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో మహిళ మరణించడం దురదృష్టకరమైన ఘటనగా ఆయన చెప్పారు. మహిళ కుటుంబానికి అండగా ఉంటానని అల్లు అర్జున్ హామీ ఇచ్చినా కూడా అరెస్ట్ చేయడం సరైంది కాదని ఆయన అన్నారు. అల్లు అర్జున్ బాధ్యతాయుతంగా వ్యవహరించారని ఆయన చెప్పారు.
అల్లు అర్జున్ అరెస్టుపై నాని ఏమన్నారంటే?
అల్లు అర్జున్ అరెస్ట్ పై హీరో నాని ఎక్స్ లో స్పందించారు. సినిమా వాళ్లకు సంబంధించిన ఏ విషయంలోనైనా ప్రభుత్వ అధికారులు, మీడియా చూపించే ఉత్సాహం.. సాధారణ పౌరులపై కూడా ఉండాలని కోరుకుంటున్నానన్నారు. మనం మంచి సమాజంలో జీవించాలి. అదొక దురదృష్టకర ఘటన దాని నుంచి మనం ఎన్నో పాఠాలు నేర్చుకోవాలన్నారు. ఏది ఏమైనా ఈ ఘటనకు కేవలం ఒక్క వ్యక్తిని మాత్రమే బాధ్యుడిని చేసి నిందించడం కరెక్ట్ కాదన్నారు.