తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ పండుగ సందర్భంగా అందించే కానుకలు సిద్ధమయ్యాయి. సిరిసిల్ల నేతన్నలు నేచిన చీరలు జిల్లాలకు చేరుకుంటున్నాయి మరికొన్ని చివరి దశలో ఉన్నాయి. అయితే నేతన్నలకు చేతి నిండి పని ఉన్నా కూడా అందాల్సిన డబ్బులు ఇంకా అందకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. సిరిసిల్ల జిల్లాలో సిద్ధమవుతున్న బతుకమ్మ చీరలపై హెచ్ఎంటీవి స్పెషల్ రిపోర్ట్.
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మహిళలకు అందించే బతుకమ్మ చీరలు గత కొన్ని రోజులుగా సిరిసిల్లలో నేస్తున్నారు. ఇప్పటికే 5 కోట్ల మీటర్ల వస్త్రాన్ని నేచిన నేతన్నలు వాటిని చీరలుగా మర్చారు. ఇంకా 2 కోట్ల మీటర్ల చీరలను సిద్ధం చేస్తున్నారు. మొత్తం 220 రకాల చీరలను ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది ఇందులో 20 లక్షల చీరలు 9 మీటర్ల చీరలు ఉండగా 80 లక్షలు 6 మీటర్ల చీరలను తయారు చేస్తున్నారు.
సిరిసిల్లలో ఇలా రేయింబవళ్లు కష్టపడుతున్న నేత కార్మికులు లాక్ డౌన్‌లో ఆగిపోయిన పని సమయాన్ని కవర్ చేస్తున్నారు. ఇప్పటవరకు 85 లక్షల చీరలను నేసి ప్రభుత్వానికి అందించారు మరో 15 లక్షల చీరలు చివరి దశకి చేరాయి. అయితే అందరికి పడినట్టే కరోనా దెబ్బ ఇక్కడి ఆసాములకు పడింది. బతుకమ్మ చీరలను ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చిన తరువాత ముడి సామగ్రితో చీరలను నేయడం మొదలు పెట్టారు. కానీ ప్రతినెలా రావాల్సిన బిల్లులు రాకపోవడంతో నేతన్నలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
నేసిన చీరలన్నీ సిరిసిల్లలో ఉన్న మార్కెట్ యార్డ్‌లో నిల్వ ఉంచింది జౌళి శాఖ అక్కడ క్వాలిటీ చెక్ చేసి హైదరాబాద్ ప్రాసెసింగ్ యూనిట్‌కి తరలిస్తుంది. బంగారం, వెండి, జరిలను కలుపుతూ ఈసారి క్వాలిటీగా చీరలను మహిళలకు అందిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. సిరిసిల్లలో ఇలా 125 మ్యాక్స్ సంఘాల్లో వేయి మంది స్మాల్ స్కేల్ పరిశ్రమల కింద మరో వేయి మంది నేతన్నలు రాత్రింబవళ్లు పని చేసి బతుకమ్మ పండుగకు చీరలను అందిస్తున్నారు.