Telangana: తెలంగాణలో కళకళలాడుతున్న జలాశయాలు

Telangana: రాష్ట్రంలో దంచికొడుతున్న వానలు * ప్రాజెక్ట్‌లకు పోటెత్తుతున్న వరదలు

Update: 2021-07-15 04:45 GMT

జలకళ సంతరించుకున్న నాగార్జున సాగర్ (ఫైల్ ఇమేజ్)

Telangana: వానలు దంచికొడుతున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఎగవ రాష్ట్రాల్లోనూ విస్తరంగా వర్షాలు పడుతున్నాయి. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో తెలంగాణలో ఏ ప్రాజెక్ట్‌ను చూసినా వరద నీరు పోటెత్తుతోంది.

పులిచింతల ప్రాజెక్ట్: 

పులిచింతల ప్రాజెక్ట్ నిండుకండను తలపిస్తోంది. ప్రాజెక్ట్‌లోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. ఈ ప్రాజెక్ట్‌ పూర్తి స్థాయి నీటి మట్టం 175 అడుగులు ఉండగా.. ఇప్పటికే 171 అడుగులకు చేరుకుంది. పులిచింతల పూర్తిస్థాయి నీటినిల్వ 45.77 టీఎంసీలు ఉండగా.. ప్రస్తుతం 39.83 టీఎంసీలుగా ఉంది.

నాగార్జునసాగర్ ప్రాజెక్టు: 

నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు స్వల్పంగా వరద నీరు వచ్చి చేరుతోంది. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు.. ఇప్పటికే 530.10 అడుగులకు చేరుకుంది. ఇన్ ఫ్లో 7,063 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 450 క్యూసెక్కులుగా కొనసాగుతోంది.

ఎల్లంపల్లి ప్రాజెక్ట్:

మంచిర్యాల జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్ట్‎కు భారీగా వరద వస్తోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు 7 గేట్లను ఎత్తివేశారు. ప్రాజెక్టు ఇన్‎ఫ్లో, ఔట్‎ఫ్లో 38,094 క్యూసెక్కులుగా ఉంది. ఎల్లంపల్లి ప్రాజెక్ట్‎కు పూర్తిస్థాయి నీటినిల్వ 20.175 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 19.48 టీఎంసీలుగా ఉంది.

మూసీ ప్రాజెక్టు:

మూసీ ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. ఏడు గేట్ల నుంచి వరద నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాజెక్ట్‌లోకి 1,872 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు కాగా... ఇప్పటికే 641.80 అడుగులకు చేరింది.

ఆలమట్టి రిజర్వాయర్‌: 

పశ్చిమ కనుమల్లో భారీగా వర్షాలు పడడంతో ఆలమట్టి రిజర్వాయర్‌లోకి 56వేల 9వందల 44 క్యూసెక్కుల వరదనీరు వచ్చింది. ఇటు శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌కు కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. నిన్నసాయంత్రం 6గంటల సమయంలోనే 78వేల క్యూసెక్కుల నీరు వచ్చింది. ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 90.31 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 53.54 టీఎంసీల నీటి నిల్వ ఉంది. రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ చెబుతోంది. దీంతో ప్రాజెక్ట్‌లకు మరింత వరద ఉద్ధృతి పెరిగే ఛాన్స్ ఉంది. 

Full View


Tags:    

Similar News