నల్గొండ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం

Update: 2020-10-17 14:01 GMT

నల్గొండ జిల్లాలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ పోలీసుల దెబ్బలకు తట్టుకోలేక అక్కడికక్కడే మృతి చెందింది. ఈ దారుణమైన సంఘటన నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ నియోజకవర్గం అడవిదేవులపల్లిలో వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనకు సంబంధించి పూర్తివివరాల్లోకెళితే మిర్యాలగూడ అడవిదేవులపల్లిలో నివాసం ఉంటున్న సక్రి(55) అనే మహిళ నాటు సారా విక్రయిస్తుందని పోలీసులకు వచ్చిన సమాచారంతో వారు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆ తరువాత ఆమెను పోలీసులు కొట్టినట్లు తెలుస్తోంది. పోలీస్ స్టేషన్ ని తీసుకెళ్లిన కొద్ది సేపటికి సక్రి మృతి చెందింది. ఈ విషయం సక్రి కుటుంబసభ్యులకు తెలియడంతో వారు అక్కడికి చేరున్నారు. పోలీసులు తీసుకువెళ్లి కొట్టిన దెబ్బలకు తట్టుకోలేక సక్రి మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు.

మృతురాలి బంధువులు మృతదేహంతో పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేయాలంటూ వాపోయారు. అయితే అప్పటికే ఆ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న పోలీసులు స్టేషన్ తలుపులు మూసి అక్కడి నుండి జారుకున్నారు. విషయం తెలుసుకున్న మృతురాలి కుటుంబసభ్యులు అక్కడే బైఠాయించి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సక్రి మృతికి కారణమైన పోలీసులపై వెంటనే చర్యలు తీసుకోవాలని వృద్ధురాలి కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై ఉన్నాధికారులను ఆశ్రయిస్తామని చెబుతున్నారు. తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించమని స్పష్టం చేశారు. బాధితులకు న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు. పోలీసుల తీరుపై స్థానికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ ఘటనపై పోలీసులు అధికారులు స్పందించలేదని సమాచారం.

Tags:    

Similar News