Adilabad Nature : అడవుల ఖిల్లా.. అదిలాబాద్ జిల్లా సహజ అందాలకు అద్దం లాంటింది. చుట్టూ పచ్చని అడవులు, ఎత్తైన గుట్టలు, ఉరకలెత్తే జలపాతలు, పచ్చని పల్లెలు, అమాయక గిరిజనులు వెరసి అదిలాబాద్ జిల్లా తెలంగాణ కాశ్మీర్ ను తలపిస్తోంది. ఇక అదిలాబాద్ జిల్లాలోని ఖండాల అందాల వీక్షణ మరో అద్భుతం.. ప్రకృతి అందాలకు చక్కని వేదికగా నిలుస్తున్న ఖండాల సహజసిద్ధ అందాలను మనం కూడా వీక్షిద్దాం.
పచ్చని వనాలు ఆదిలాబాద్ జిల్లాకు ప్రకృతి ప్రసాదించిన వరాలు. ఇక ఆదిలాబాద్ జిల్లాలోని ఖండాల ప్రాంతంలో ప్రకృతి అందాలు కొకొల్లలు. ఇక్కడ సహజ అందాలు అడుగడుగున ఆకట్టుకుంటాయి. అటుగా వెళ్లే ప్రయాణికులకు కనువిందు చేస్తాయి. ఇక వానకాలం రాగానే ఆ అందాలు రెట్టింపవుతాయి. పచ్చదనం ప్రకృతి అందాలకు సరికొత్త శోభను అద్దుతుంది.
సహజసిద్ధమైన అడవిలో ఎత్తైన కొండల నడుమ ఉరకలెత్తే జలపాతాన్ని వీక్షిస్తే.. ఆ అనుభూతే వేరు.. నింగిని తాకేలా కొండలు.. చుట్టూ పచ్చదనం మధ్యలో వయ్యరాలు ఒలకబోసే ఘాట్ రోడ్లు ఈ దారి వెంట వెళ్లే ప్రయాణుకులు తమని తాము మైమరిచిపోవడం ఖాయం. భూతల స్వర్గసీమగా ఉన్న ఖండాలు ప్రాంతం జిల్లా కేంద్రానికి 18 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సుమారు 850 మీటర్ల కంటే ఎత్తైనా ప్రాంతంలో ఉండే ఈ సుందర దృష్యాలు కనువిందు పంచుతాయి.
ఖండాలు ప్రాంతంలో మొలలగుట్ట గ్రామ సమీపంలో మూడు జలపాతాలు ఉన్నాయి. కోపేన్ గిడి జలపాతం. గిరిజన దేవతలు మెచ్చిన సుందర ప్రాంతంగా గిరిజనులు భావిస్తారు. కోపేన్ గిడి జలపాతాన్ని అనుకొని మరో రెండు జలపాతాలు జలసవ్వడి చేస్తూ సాగుతుంటాయి. ఆదిలాబాద్ జిల్లాలో టూరిజాన్ని అభివృద్ధి చేసేందుకు వనరులు, అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రభుత్వం ఈ జిల్లాపై కాస్త దృష్టి పెడితే మంచి టూరిజం స్పాట్ గా నిలుస్తోంది.