Adilabad Agency People Face Viral Fevers: ఆదిలాబాద్ ఏజెన్సీలో వణికిస్తున్న విషజ్వరాలు
Adilabad Agency People Face Viral Fevers: గిరిజన ప్రాంతాల్లో విష జ్వరాలు గిరిజనులను వెంటాడుతున్నాయి. ఆదివాసుల నివాసాల్లో రాకాసి రోగాలు స్వైరవిహారం చేస్తున్నాయి.
Adilabad Agency People Face Viral Fevers: గిరిజన ప్రాంతాల్లో విష జ్వరాలు గిరిజనులను వెంటాడుతున్నాయి. ఆదివాసుల నివాసాల్లో రాకాసి రోగాలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఇప్పటికే కరోనా భయంతో అల్లాడుతుంటే మరోవైపు విషజ్వరాలు గిరిజనుల పాలిట శాపంగా మారాయి. ఆదిలాబాద్ ఏజెన్సీలో గిరిజనులను వణికిస్తున్న విషజ్వరాలపై హెచ్ఎంటీవీ స్పెషల్ రిపోర్ట్.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. గిరిజన గూడెంలో ఎక్కడ చూసినా డెంగ్యూ, మలేరియా, డయేరియా వంటి వ్యాధులు రెచ్చిపోతున్నాయి. ప్రాణంతకమైన రోగాలు వేధిస్తుండడంతో గిరిజనులు తీవ్ర అందోళన చెందుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరైన వైద్యం అందక చికిత్స కోసం ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా భావించిన ప్రైవేట్ అస్పత్రులు ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఉట్నూర్ మండలం ఎంద గ్రామంలో అధికారికంగా మూడు డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. ఇందులో ఇంటర్ విద్యార్థిని, ఆరేళ్ల బాలుడు కూడా ఉన్నారు. మరోవైపు డయేరియా బారినపడిన గిరిజనులు కదలేని నిస్సహయస్థితిలోకి చేరుకుంటున్నారు. కలుషిత నీళ్లు తాగడం వల్లే గిరిజనులు డయేరియా, విషజ్వరాల బారిన పడుతున్నారు.
విషజ్వరాల సంఖ్య రోజురోజుకి భారీగా పెరుగుతున్నాయి. రోగాల బారిన పడిన వారు స్థానిక ప్రాథమిక అరోగ్య కేంద్రాల్లో మరికొందరు కమ్యూనీటి హెల్త్ కేంద్రాల్లో చికిత్స పొందుతున్నారు. మరోవైపు ఉట్నూర్ అసుపత్రి రోగులతో కిటకిటాలాడుతోంది . అయితే గిరిజన ప్రాంతాల్లో డెంగ్యూ విజృంభిస్తున్నా అధికారులు నివారణ చర్యలు చేపట్టడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. తూతూమంత్రగా ర్యాపిడ్ సర్వే చేస్తున్నారని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. దనోరా గ్రామంలో మలేరియా కేసు నమోదైంది. కాని ఇది మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన కేసుగా అధికారులు గుర్తించారు. వైద్యసిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ విషజ్వరాల నియంత్రణకు చర్యలు చేపట్టాలని గిరిజనులు కోరుతున్నారు.