Adilabad: వర్షంతో వాగుదాటలేని పరిస్థితి.. గొడుగుకింద పురుడు పోసిన 108 సిబ్బంది
Adilabad: చిన్నుగూడకు వెళ్లేందుకు రోడ్డు సౌకర్యంలేక అవస్థలు
Adilabad: పురిటి నొప్పులతో ఉన్న ఆదివాసీ మహిళ ఆసుపత్రికి వెళ్లేందుకు.. వర్షంలో, వాగు దాటాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో నొప్పులు ఎక్కువ కావడంతో 108 సిబ్బంది వాగు ఒడ్డునే గొడుగు కింద ఆమెకు పురుడు పోశారు. తల్లీబిడ్డలను క్షేమంగా ఆసుపత్రికి తరలించారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం దొంగచింత పంచాయతీ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. చిన్నుగూడకు చెందిన ఆత్రం భీంబాయికి పురిటినొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108కి సమాచారం అందించారు.
వెంటనే సిబ్బంది దొంగచింతకు చేరుకొన్నారు. అక్కడి నుంచి చిన్నుగూడకు వెళ్లేందుకు రోడ్డు సౌకర్యం లేదు. దానికితోడు ఆ గ్రామానికి వెళ్లే మార్గంలో వాగు ప్రవహిస్తోంది. దీంతో 108 సిబ్బంది రెండు కిలోమీటర్లు కాలినడకన వెళ్లి వాగు దాటారు. వాగు ఒడ్డు వరకు వచ్చిన గర్భిణికి నొప్పులు ఎక్కువ కావడంతో స్థానిక మహిళలతో కలిసి సిబ్బంది గొడుగు కిందే పురుడు పోశారు. అనంతరం వారిని జాగ్రత్తగా వాగు దాటించి ఉట్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 108 సిబ్బంది ఈఎంటీ శంకర్, పైలట్ సచిన్‌కు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.