సిద్ధిపేట జిల్లాలో చిరుతపులి అలజడి
* వడ్డేపల్లి పరిసరాల్లో పశువులను బలిగొన్న చిరుత.. పశువుల కాపరుల కంటిపై కునుకులేకుండా చేసింది.
Cheetah Wandering: సిద్ధిపేట జిల్లాలో చిరుతపులి అలజడి సృష్టించింది. వడ్డేపల్లి పరిసరాల్లో చిరుత సంచరిస్తూ గ్రామ ప్రజలకు, పశువులు, గొర్రెల కాపరులకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఇటీవల పులిసంచరిస్తూ పశువులను, మేకలను, గొర్రెలను పొట్టనబెట్టుకుంటోందని వడ్డేపల్లివాసులు ఆందోళన చెందుతున్నారు. చిరుతపులి ఏ సమయంలో ఏంచేస్తుందోనని గొర్రెల కాపరులు కంగారుపడుతున్నారు.
సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం వడ్డేపల్లి, దుబ్బాక మున్సిపల్ పరిధిలోని మల్లాయిపల్లి అటవీ ప్రాంతంలో మల్లన్నగుట్ట సమీపంలో చిరుత సంచరిస్తోంది. చిరుత పశువులను చంపి తింటున్నట్టు, ఆయా గ్రామాల ప్రజలు చెబుతున్నారు. చిరుత సంచారంపై స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. పులి ఆనవాళ్లను గుర్తించిన అటవీశాఖ అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు.
చిరుత సంచారంతో ఉలిక్కిపడుతున్న స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. ఎన్నిసార్లు విన్నవించిన అధికారులు చిరుత సంచారంపై దృష్టి సారించడం లేదని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికైనా ఫారెస్ట్ అధికారులు స్పందించి చిరుత బారి నుంచి తమను రక్షించాలని కోరుతున్నారు.