బాసర శ్రీ జ్ఞానసరస్వతి పుణ్యక్షేత్రానికి భక్తుల తాకిడి
* అమ్మవారి జన్మదినం, వసంత పంచమి సందర్భంగా పోటెత్తిన భక్తులు * పొరుగు రాష్ట్రాల నుంచి తరలివస్తున్న భక్తులు
అమ్మవారి జన్మదినం, వసంత పంచమి సందర్భంగా నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞానసరస్వతి పుణ్యక్షేత్రానికి పెద్ద ఎత్తులో తరలివస్తున్నారు భక్తులు. తెలుగు రాష్ట్రాలే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఆలయానికి భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు. అమ్మవారిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. అర్ధరాత్రి నుంచే అమ్మవారి దర్శనం కోసం క్యూలైన్లలో బారులు తీరారు భక్తులు. తమ పిల్లలతో ఆలయ సన్నిధిలో భారీగా అక్షరభ్యాసాలు, కుంకుమార్చన పూజలు నిర్వహిస్తున్నారు. దీంతో అమ్మవారి దర్శనానికి 3 నుంచి 4 గంటల సమయం పడుతోంది.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. ఆలయంలో భక్తులు కోవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు చేపట్టారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో వాహనరద్దీ ఉండకుండా ఆలయానికి కిలోమీటర్ దూరంలోనే వెహికల్స్‌ను నిలిపివేస్తున్నారు. డీఎస్పీ, ఆరుగురు సీఐలు, 25 మంది ఎస్‌ఐలతో పాటు 300 మంది పోలీస్ సిబ్బందితో భద్రతా చర్యలు చేపట్టారు. ఇంకోపక్క గత అర్ధరాత్రి నుంచే భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో ఆలయ అతిథి గృహాలన్నీ నిండిపోయాయి. దీంతో చాలా మంది ఆలయ ఆవరణలో నిద్రించారు.