ఐడియా అదిరింది గురూ! కారుని కాపాడుకోవడానికి ఏం చేశారో చూడండి..
Hyderabad floods: హైదరాబాద్ కు మరో సారి వాన ముప్పు పొంచిఉందని అధికారులు చెబుతున్న నేపధ్యంలో ఓ హైదరాబాదీ తన కారును రక్షించుకోవడానికి చేసిన పని చూస్తె ఔరా అనిపించక మానదు.
భారీ వర్షాలకు రోడ్లు ఏర్లయిపోయాయి హైదరబాద్ లో. నాలుగు రోజుల క్రితం కురిసిన వర్షాల బీభత్సం నుంచి నగరం ఇంకా పూర్తిగా తేరుకోలేదు. మళ్ళీ నిన్నటి నుంచి భాగ్యనగరాన్ని భారీ వర్షాలు మున్చేట్టుతూనే ఉన్నాయి. దీనికి తోడు అధికారులు కూడా మరో మూడు రోజుల పాటు తెలంగాణా వ్యాప్తంగా భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయనీ, ముఖ్యంగా జంట నగరాల్లో మళ్ళీ భారీ వర్షాలు ముంచెత్తే అవకాశం ఉందని చెబుతూ వస్తున్నారు. దీంతో ప్రజలంతా భయంతొ ఉన్నారు. అందరూ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్నారు. బయటకు వెళ్ళే విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు.
ఇదిలా ఉంటె మొన్న భారీ వర్షాలకు రోడ్ల మీద నీళ్ళు ముంచెత్తాయి. ఈ వాన నీటిలో కార్లు.. బైకులు.. ఒక్కోచోట మనుషులూ కొట్టుకుపోయిన దృశ్యాలు చాలా కనిపించాయి. చాలా వాహనాలు వరదనీటిలో పడవల్లా కొట్టుకుపోయి ఎందుకూ పనికిరాకుండా పోయాయి. ఈ నేపధ్యంలో మళ్ళీ వర్షాలు కురిసే అవకాశం ఉందనే అధికారుల హెచ్చరికలతో..ఒక ఇంటి ముందు కారును తాడుతో కట్టేశారు. కారు నీటిలో కొట్టుకుపోకుండా ఉండేందుకు గాను.. తాడుతో బంపర్ ను ఇంటి గేటుకు ముడి వేసేశారు. దీనిని ఎవరో ఫోటో తీసి సోషల్ మీడియాలో ఉంచారు. దీంతో ఆ ఫొటోకు విపరీతమైన లైకులు కామెంట్లు వస్తున్నాయి. ఒక్కసారిగా ఈ ఫోటో వైరల్ గా మారిపోయింది. ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే తాడుతో కారును కట్టేసిన ఆ కారు యజమాని, సైలెన్సర్ లోకి నీరు పోకుండా ఒక సిమెంట్ సంచిని అడ్డుగా పెట్టారు..
ఇక ఈ ఫోటోను చూసిన నెటిజన్లు ఫోటో కు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. కొంతమంది భలే ఆలోచన అంటున్నారు. కొందరు ఆ కారుకు కట్టిన తాడు చాలా స్ట్రాంగ్ అని వ్యంగ్యంగా కామెంట్ చేశారు. కొందరు ప్రకృతి బీభత్సాన్ని ఎవరూ ఆపలేరు అంటూ వ్యాఖ్యానించారు. మొత్తమ్మీద హైదరాబాద్ వరదలలో ఫన్ వెతుక్కుంటున్నారు నెటిజన్లు! అదేవిధంగా అయిడియా అదిరింది గురూ అంటున్నారు!!