Hyderabad: డెక్కన్‌మాల్ అగ్ని ప్రమాదంపై కేసు నమోదు.. భవనం కూల్చివేతకు నిర్ణయం
Hyderabad: భవన యజమాని హమ్మద్, రహీంపై కేసు నమోదు
Hyderabad: సికింద్రాబాద్‌లో సెగ పుట్టించిన డెక్కన్ మాల్‌లో ఇంకా మంటలు ఆరలేదు. సెల్లార్ నుంచి మంటలు ఎగిసిపడుతున్నాయి. మంటలు పూర్తిగా ఆరేందుకు మరికొంత సమయం పట్టే అవకాశముంది. మరోవైపు డెక్కన్ మాల్ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేశారు. భవన యజమానులు హమ్మద్, రహీంలపై కేసు బుక్ అయింది. అలాగే అగ్నిప్రమాదం ఘటనలో ముగ్గురు వ్యక్తులు వసీం, జునైద్, జహీర్ అదృశ్యమైనట్లు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు.
నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన డెక్కన్ మాల్‌ను కూల్చివేయాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కాసేపట్లో గ్రేటర్ టౌన్ ప్లానింగ్ అధికారులు భవనం వద్దకు చేరుకోనున్నారు. మాల్‌లో మంటల పరిస్థితిని బట్టి ఇవాళ లేదా రేపు కూల్చివేసేందుకు చర్యలు చేపట్టనున్నారు. పక్కనే ఉన్న బస్తీ వాసులను ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలించినప్పటికీ.. మళ్లీ తిరిగి వస్తున్నారు. దీంతో వాళ్లందరినీ కమ్యూనిటీ హాల్‌కు వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు.
డెక్కన్ మాల్‌లో మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి. 40 ఫైరింజన్లతో మంటలను అదుపు చేశారు. నిన్న ఉదయం 11 గంటల సమయంలో చెలరేగిన మంటలు.. రాత్రి అయ్యేంత వరకు అదుపులోకి రాలేదు. అగ్ని కీలలు ఎగిసిపడుతుండడంతో.. ఫైర్ ఫైటర్స్‌కు రెస్క్యూ చేయడం కష్టతరంగా మారింది. చివరికి రాత్రి 9గంటల సమయంలో మంటలను అదుపులోకి తెచ్చారు. సుమారు 10గంటల పాటు మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించారు.
భవనంలో కెమికల్స్ ఉండటం వల్లే ఈ స్థాయిలో నష్టం జరిగిందన్నారు మంత్రి తలసాని. ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా బిల్డింగ్ పరిసరాల్లో ఉన్న ఇళ్లను ఖాళీ చేయించామన్నారు. ఇచ్చిన అనుమతులకు బదులు ఆక్రమించుకొని కట్టడాలు కట్టారన్నారు. చాలా బిల్డింగ్ లకు NOC సైతం లేవన్న మంత్రి.. అలాంటి వాటిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
డెక్కన్ మాల్ ప్రమాద ఘటనపై స్థానికులు తీవ్రంగా మండిపడ్డారు. అగ్ని ప్రమాదం జరిగిన దగ్గర నుంచి తమ ఇళ్లను వదిలి రోడ్డు పైనే ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా కట్టడాలు నిర్మిస్తున్నా.. అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు.