సైబరాబాద్‌లో భారీగా గంజాయి పట్టివేత
*రూ.2 కోట్ల విలువైన 800 కిలోల గంజాయి స్వాధీనం
Hyderabad: హైదరాబాద్ నగరంలోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీగా గంజాయి పట్టుబడింది. పత్తి విత్తనాల మాటున గంజాయి సరఫరా చేస్తున్న ముఠా గుట్టును ఎస్.ఓ.టీ అధికారులు రట్టు చేశారు. వారి వద్ద నుంచి 2కోట్ల రూపాయల విలువ చేసే 800 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇద్దరిని అరెస్ట్ చేశారు. వీరు ఒడిశా నుంచి హైదరాబాద్ మీదుగా గంజాయి రవాణా చేస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ గంజాయిని యూపీతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలకు సరఫరా చేసేందుకు తీసుకెళ్తున్నట్టుగా కనుగొన్నారు. ఈ ఘటనకు సంబంధించి పరారీలో ఉన్న ముగ్గురు యూపీ వాసుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.
ఒడిశా ప్రాంతంలో కిలో గంజాయి 3 వేల రూపాయల చొప్పున కొనుగోలు చేసి 20 వేలకు విక్రయిస్తున్నారు. కోరాపుట్‌లో సుభాష్‌కుమార్ గంజాయి సాగు చేస్తుండగా వికాస్ జాదవ్ అతడి నుంచి గంజాయి కొనుగోలు చేసి అశోక్‌కూలే, అమోల్‌కు అప్పగించేవాడు. వారు విలాస్ జగనాథ్, రాహుల్ కుమార్, ఫీరోజ్ మోమిన్, సుధామ్ సహకారంతో నాసిక్‌కు గంజాయి తరలించేవారు. వికాస్ జాదవ్, సుభాష్‌కుమార్ 800 కిలోల గంజాయిని హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు సరఫరా చేయాలని నిర్ణయించారు. అశోక్‌కూలే, రాహుల్‌కుమార్ సింగ్ కారులో ముందు వెళుతుండగా, విలాస్ జగన్నాథ్, సుధామ్ డీసీఎంలో వారిని అనుసరించారు. ఎవరికీ అనుమానం రాకుండా డీసీఎం పై భాగంలో పత్తి గింజల సంచులను లోడ్ చేశారు. తెలంగాణలో గంజాయిపై స్పెషల్ డ్రైవ్ కొనసాగతుండటం, ఓఆర్‌ఆర్ టోల్‌గేట్ల వద్ద టోల్ రుసుముతో పాటు చెకింగ్ పాయింట్స్‌లో పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ఎత్తుగడ వేశారు. నగరంలో నుంచి గూడ్స్ లారీ మాదిరిగా వెళ్లడానికి ప్రయత్నించారు. అయితే డీసీఎం వ్యాన్ మియాపూర్ పరిధిలోకి రాగానే సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు.