hmtv, హన్స్ ఇండియా ఆధ్వర్యంలో 75 మంది వైద్యులకు సత్కారం.. ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి హరీష్‌రావు..
Doctors: ప్రైవేటు ఆస్పత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను తీర్చిదిద్దుతున్నామని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు వెల్లడించారు.
Doctors: ప్రైవేటు ఆస్పత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను తీర్చిదిద్దుతున్నామని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. స్వాతంత్ర్య వజ్రోత్సవాలను పురస్కరించుకొని విశేష సేవలు అందించిన 75 మంది ప్రముఖ వైద్యులను hmtv సత్కరించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి హరీశ్ రావు వైద్యులను సన్మానించారు. విశేష సేవలు అందించిన డాక్టర్ల సేవలను కొనియాడారు. hmtv ప్రారంభించిన నాటి నుంచి అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తోందని మంత్రి అభినందించారు.
స్వాతంత్ర్య వజ్రోత్సవాలను పురస్కరించుకొని వైద్యరంగంలో విశేష సేవలు అందించిన 75 మంది డాక్టర్లను hmtv సత్కరించింది. పేద ప్రజలకు వైద్యులు అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు వైద్యుల సేవలను ప్రశంసించారు. వైద్యరంగానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రశంసించారు. అప్పట్లో వైద్యవిద్యను అభ్యసించడం కష్టమయ్యేదని కొద్ది కాలేజీలు మాత్రమే అందుబాటులో ఉండేవిని మంత్రి గుర్తుచేశారు. ఈ ఏడేళ్లలో వైద్య కాలేజీల సంఖ్యను గణనీయంగా పెంచామన్న మంత్రి రాబోయే రోజుల్లో 33 జిల్లాల్లో 33 వైద్య కళాశాలల ఏర్పాటే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. కొవిడ్ తర్వాత వైద్యరంగంపై అందరూ దృష్టిపెట్టారని తెలంగాణలో 20వేల బెడ్స్ అందుబాటులోకి తెచ్చామని మంత్రి హరీష్‌రావు వివరించారు. వైద్యులకు అవసరమైన సహకారం అందిస్తామన్నారు. వైద్యుల సేవలు గుర్తించి సన్మానించిన hmtv ప్రయత్నాన్ని మంత్రి అభినందించారు.
వైద్యులు పేదలకు మరింత సేవలందించాలని కోరుకుంటున్నామని హరీష్‌రావు తెలిపారు. సిజేరియన్లు తగ్గించాలని మహిళల ఆరోగ్యాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. పొరుగు రాష్ట్రాల్లో సిజేరియన్లు తక్కువగా ఉన్నాయన్నారు. నార్మల్ డెలివరీ చేసిన వైద్యులకు 3వేల రూపాయల ప్రోత్సాహకంగా ఇస్తున్నామని చెప్పారు. ప్రైవేట్ ఆస్పత్రులు సేవాతత్వం పెంచుకోవాలని ప్రైవేట్‌కు సమానంగా ప్రభుత్వ ఆస్పత్రులను తీర్చిదిద్దుతున్నామని వెల్లడించారు. త్వరలో కేసీఆర్ న్యూట్రీషియన్ స్కీమ్, డాక్టర్లు, జర్నలిస్టులకు కొత్త ఇన్స్యూరెన్స్ స్కీమ్ తీసుకువచ్చే ప్రయత్నం చేస్తు్న్నామని హరీశ్ రావు తెలిపారు.
వైద్యరంగంలో నీతి ఆయోగ్ ర్యాంకింగ్స్‌లో తెలంగాణ 3వ స్థానంలో ఉందని మంత్రి హరీష్ రావు తెలిపారు. ఎక్కడ చూసినా కేరళ నర్సులే కనిపిస్తారని నర్సుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వివరించారు. రాష్ట్రంలో వచ్చే రెండేళ్లలో 33 నర్సింగ్ కళాశాలల ఏర్పాటుతోపాటు స్పెషలైజేషన్ కోర్సులు తీసుకువస్తామన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఏడు సంవత్సరాల్లో 17 మెడికల్ కాలేజీలు పెంచామని మంత్రి హరీశ్ రావు వివరించారు. హైదరాబాద్ లో 4 సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రులు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి హరీశ్ రావు తెలిపారు. మెరుగైన వైద్యవిద్యపైనా ప్రభుత్వం దృష్టిపెట్టిందన్నారు.