Telangana Elections: ఇప్పటి వరకు రూ.520కోట్ల విలువైన డబ్బు, మద్యం సీజ్
Telangana Elections: ఇప్పటి వరకు 88కేసులు నమోదు చేసిన ఈసీ
Telangana Elections: తెలంగాణలో ఎన్నికల వేళ ప్రలోభాల పర్వం జోరుగా కొనసాగుతోంది. డబ్బు, మద్యం, ఖరీదైన వస్తువులను ఓటర్లకు గాలంగా వేస్తున్నాయి పార్టీలు. తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చి నెల రోజులు అవుతోంది. ఈ నెల రోజుల్లోనే పోలీసుల తనిఖీల్లో ఏకంగా 520కోట్ల విలువైన డబ్బు, మద్యం, నగదు, మత్తు పదార్థాలు, ఖరీదైన వస్తువులు పట్టుబడ్డాయి. సరైన అధారాలు లేకుండా డబ్బును, మద్యాన్ని సరఫరా చేస్తే సీజ్ చేస్తున్నారు తనిఖీ అధికారులు. పోలీసుల తనిఖీల్లో 24 గంటల వ్యవధిలోనే 20కోట్ల రూపాయల విలువైన సొత్తు పట్టుబడింది. కరీంనగర్ లో 2.36 కోట్లు, మియాపూర్ లో 17 కిలోల బంగారం, కవాడిగూడలో 2.09 కోట్ల నగదు, వాడపల్లి చెక్ పోస్ట్ వద్ద 3 కోట్ల నగదు పట్టుబడింది. సరైన పత్రాలు లేకుండా ఎవరు నగదు తరలించినా యంత్రాంగం ఉపేక్షించడం లేదు. తనిఖీల్లో దాదాపు 84వేల 400 లీటర్ల మద్యం, 75 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు ఈసీ 88 కేసులు నమోదు చేసింది.
ఎన్నికలంటేనే ఖరీదైనదిగా మార్చేశాయి పార్టీలు. ఎన్నికల్లో ఎలాగైన గెలవాలనే కోరికతో.. విచ్చల విడిగా ప్రలోభాలకు తెర తీస్తున్నారు అభ్యర్థులు. డబ్బు, మద్యంతో పాటు.. కుక్కర్లు, చీరలు, గోడ గడియాలను పంచుతున్నారు. కొన్ని చోట్లు మత్తు పదార్తాలను కూడా సరఫరా చేస్తున్నట్టు తెలుస్తోంది. పోలీసుల తనిఖీల్లో భారీగా డ్రగ్స్ పట్టుపబడుతోంది. ఇంకొంతమంది తాయిళాల కోసం కొత్త దారులు వెతుకుతున్నారు. ఈసీ కళ్లు కప్పేందుకు.. డిజిటల్ పేమెంట్స్, షాపింగ్ మాల్స్ ద్వారా ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న ఎన్నికలు..దేశంలోనే ఖరీదైనవిగా మారిపోయాయి. ఎన్నికల కోసం..ఒక్కో అభ్యర్థి.. 50నుంచి 100కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఈనెల రోజుల్లో పట్టుబడిన సొత్తే 520కోట్లు ఉంటే.. ఇంకా పట్టుబడకుండా చేతులు మారిన డబ్బు విలువ ఎంత ఉంటుందని ఊహించడమే కష్టంగా మారింది. ఎన్నికలకు ఇంకా 20రోజుల టైం ఉంది. ఈ మిగిలన రోజుల్లో ఇంకెంత నగదు, మద్యం సరఫరా కానుందనే ఆసక్తి నెలకొంది. వందల కోట్ల నుంచి వేల కోట్ల పైనే నగదు పట్టుబడే అవకాశం ఉంది. పోలీసులు, ఎన్నికల అధికారులు ఎంత పకడ్బందీగా తనిఖీలు చేస్తున్నా..గుట్టు చప్పుడు కాకుండా.. ఇంకా భారీ ఎత్తునే సొత్తు చేతులు మారుతున్నట్టు తెలుస్తోంది.